Friday, January 25, 2013

ఆంధ్ర లో బతుకమ్మని జరుపుకుంటారు , తెలంగాణా లో దోపిడీదారులెవరు?

   కొందరు బతుకమ్మ పండుగను సీమంధ్రలో అసలు జరుపుకోరు అని అవగాహనా లేమితో అంటున్నారు.(వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి). ఇది నిజం కాదు .  ఆంధ్ర ప్రాంత్రం లో  అనేక పల్లెల్లో బతుకమ్మను పెట్టుకొని సాయంత్రం పుట ఆడవాళ్ళంత చేరి భజనలు, పాటలతో అమ్మని కీర్తించి ప్రసాదాలు పంచుతారు. కాకపోతే బతుకమ్మని నిమజ్జనం చేసే యాత్రలో మగవాళ్ళు పాల్గొంటారు.

     పండుగ ఆచార వ్యవహారాలు జరుపుకొనే క్రమంలో ఒక జిల్లాలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది విషయం అప్రస్తుతమైనప్పటికీ ఉదాహరణకు చెప్పక తప్పటం లేదు.ఎవరైనా ఒక మనిషి కాలం చేసినప్పుడు అంతిమ సంస్కారం విషయంలో గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి డివిజన్ లలో ఒక రకంగాను, నరసరావు పేట తాలూకా లో ఒక రకం గాను, పలనాడు ప్రాంతం లో ఒక రకం గాను ఉంటుంది. గుంటూరు తెనాలి తాలూకాలలో అంతిమ సంస్కార  యాత్రలో కేవలం   కుటుంబ పెద్ద మాత్రమే(మగ) కాటి  దగ్గరకు వెళతాడు.( చనిపోయిన వ్యక్తి బంధువు 60 సం. వ్యక్తి  అయినా , ఆయన తండ్రి తిరగ గలిగి ఉంటే, తండ్రి మాత్రమే కాటి  దగ్గరకు వెళతాడు). నరసరావు పేట తాలుకాలో మగవాళ్ళు (4 సం. పిల్లలతో సహా )వల్లకాడు దగ్గరకు వెళతారు .  ఆడవాళ్లు మాత్రం వెళ్ళరు . పల్నాడు ప్రాంతం లో మాత్రం ఆడ, మగ, వయసుతో తారతమ్యం లేకుండా అందరు వెళతారు. ఈ మూడు ప్రాంతాలతో నాకు సన్నిహిత సంబందం ఉంది వాటిలో నేను పాలు పంచుకొని ప్రత్యక్షంగా చూసాను. ఆ ప్రాంతం లో తక్కువ మంది పాల్గొన్నారు, పాల్గొనని వాళ్ళకి ప్రేమ లేదు అని అనలేము కదా! ఆచార వ్యవహారాలు ఒక్కో గ్రామంలో పెద్దల నుండి  వారసత్వంగా వచ్చేవి. వాటిలో పెద్దగా  మార్పులు ఉండవు. మార్పులను మనం అంతగా అంగీకరించలేము కదా ! ఒక జిల్లా లోనే ఇన్ని తేడాలు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకునే దానిలో తెలంగాణాలో, ఆంధ్రా లో (అంటే అన్ని ప్రాంతాలలో) ఒకే రకంగా జరుపుకుంటారనుకోవటం, జరుపుకోవాలనుకోవటం ఎంత వరకు సబబు?

     ఆంధ్ర ప్రాంతం లో దసరా పండుగలో బతుకమ్మ ఒక భాగం మాత్రమే. దసరా పండుగ రోజు శమీ పూజ చేస్తారు. కొన్ని గ్రామాలలో అయితే ఊరి  బయట జమ్మి చెట్టు దగ్గరకు ఒక గొర్రె పిల్లను తీసుకోని వెళ్లి దానికి పూజలు జరిపి, గొర్రెపిల్ల తోకను కొద్దిగా కోసి, సున్నం పెట్టి వదులు తారు. అది భయం తో ఎవరికీ చిక్కకుండా పెరిగెత్తుతుంది. అక్కడ ఉన్న జనాలందరూ గొర్రె కోసం పెరిగెత్తుతారు.ఎవడైతే గొర్రె పిల్లను పట్టుకుంటాడో ఆ భాగం వాడి సొంతం అవుతుంది.

     కొంతమంది హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. తెలంగాణాలో గుంటూరు పల్లెలు చాల ఉన్నాయి, కానీ తెలంగాణా వసులేవారు ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి  ఇష్టపడరు అని అంటున్నారు. ఆంధ్రా లో కూడా చాల ప్రాంతాలలో తెలంగాణా వాసులు ఉన్నారు. కాకపోతే కొద్ది సంఖ్యలో ఉంటారు. వారిని నైజామోళ్ళు  అంటారు. ఇప్పుడు రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో రాజస్తాన్, ఒరిస్సా, బీహార్  వాసులు టీ, చాట్ భండార్ ,స్వీట్ షాపులు నడుపుకునే వారు ఉన్నారు. గుంటూరు, విజయవాడ వంటి పెద్ద పట్టణాలలో మార్వాడీలు చెప్పుకో దగ్గ సంఖ్యలో ఉన్నారు. ప్రశాంతం గా వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. ఆంధ్రులు వారి మిద పది కొట్టి అల్లరి పెట్టిన  సందర్భాలు లేవు. తెలంగాణా ఉద్యోగులకు ఆంధ్రలో పని చేయటం ఇష్టం ఉండదు ఎందుకంటే వారికీ మర్యాద ఇవ్వరు అని ఒక వాదన. అది మాత్రం నిజం కాదు. వందల సంఖ్యలో తెలంగాణకు సంబంధించిన వారు బంట్రోతు స్థాయి నుండి అధికారి స్థాయి వరకు వివిధ ఉద్యోగాలలో పని చేస్తున్నారు. వారిని ఉద్యోగులుగానే చూస్తారు గానీ ప్రాంతం చూపుతో ఎవరూ  చూడరు. ఇక్కడ ఉద్యోగులెవరూ బదిలీ కావాలని కోరుకోరు. అంతెందుకు తెలంగాణాకి చెందిన అనేక మంది విద్యార్ధులు ( 6th  నుండి ఇంటర్ ) గుంటూరు, విజయవాడకు చెందినా కార్పోరేట్  స్కూళ్ళలో చదువుతున్నారు.వారిని ఏనాడైనా ఎవరైనా వేధించారా? కాకపోతే ఒక వ్యక్తిని తప్పు చేసావని మందలించినా, లేక వాడు మంచి వాడైనప్పటికీ, అవతలి వాడు దురుసుగా ప్రవర్తించినా దానికి అనేక కారణాలు వెతుకుతాం. కులం, మతం, ప్రాంతం, జాతి ఇలాంటివన్నీ ( మంద జగన్నాధం MP  బ్యాంకు మేనేజర్ ని కొట్టి ఆయనపై SC  కేసు పెట్టడం వంటివి).

     మరొక వాదన ఏంటంటే , ఆంధ్రా  వాళ్ళు తెలంగాణా వారిని దోచుకుంటున్నారు అనేది. ఇది నిజమో అబద్దమో నాకు తెలియదు కానీ, తెలంగాణా వారిని తెలంగాణా వారే తెగ దోచుకుంటున్నారు. మార్చ్ నెలలో అన్ని పత్రికలలో ప్రముఖంగా ఒక ఫోటో వచ్చింది. తమ బిల్లులు చెల్లించటానికి లంచం అడిగారనీ,తమ వద్ద డబ్బు లేదనీ , తమ మేడలో ఉన్న పుస్తెలు  తీసి ఒక ప్రభుత్వ అధికారి ముందు పెట్టారు నిజామాబాద్ జిల్లాకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు. ఆ కార్యాలయంలో ఎవరూ  ఆంధ్ర వారు లేరే!

     మరొక ఉదాహరణ - నా మిత్రుడు గతంలో టీచర్ గా పని చేసి , ప్రస్తుతం ఒక ప్రభుత్వ కీలక శాఖలో పని చేస్తున్నాడు. వాడి జిల్లా స్థాయి అధికారి వాడిని పిలిచి పత్తి  విత్తనాలు కావాలని అడిగారు. ఎందుకంటే అయన మిత్రుడు 'ఇస్తారి" వ్యవసాయం చేస్తాడు. ఆయనది ఖమ్మం జిల్లా. అక్కడ బ్లాకు మార్కెట్ లో 3 రెట్లు ధర చెల్లించి కొనాలి. ఇక్కడ MRP  మిద రేటు కొంచెం ఎక్కువైనా ఫరవాలేదు విత్తనాలు కావాలని అడిగారు. నా  మిత్రుడు వ్యవసాయ శాఖ వారి సహకారంతో వారు అడిగిన విత్తనాలు ఇవ్వగలిగాడు  ఇస్తారి గారితో మాట్లాడినప్పుడు, వారు  -మా దగ్గర రైతును విపరీతంగా దోచేస్తారు.విత్తనాలు బ్లాకు మార్కెట్ లో అమ్ముతారు. పురుగు మండులైతే MRP  రేట్ కన్నా చాల తక్కువ రేట్ కే వస్తాయి. కానీ వాళ్ళు MRP  రేటు మీదే అమ్ముతారు.అందుకే మేం  గుంటూరు నుండి తెప్పించుకుంటాం- అన్నారు. నిజమే గుంటూరు, నరసరావు పేట, పల్నాడు ప్రాంతాలలో జరిగే పురుగు మందుల వ్యాపారం లో కనీసం 10 శాతం తెలంగాణా వారిదే . ఎక్కడ సరిగా ఉంటే  వారు అంట కష్టపడి  ఇక్కడ దాక వచ్చి విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేయడం ఎందుకు చెప్పండి.

     తెలంగాణా ప్రాంతం లో అక్షరాస్యత అంత  తక్కువగా ఎందుకు ఉంది?  విద్య ప్రమాణాల స్థాయి ఎందుకు తక్కువగా ఉంది? పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్ లు ఎందుకు ఉంటున్నారు? రోగాలతో అల్లాడుతున్న రోగులకు సేవ చేయాల్సిన సిబ్బంది ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారు? సిబ్బందిలో ఎందరు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు?తమ ప్రాంత ప్రజల మీద అంత ప్రేమ, మమకారం ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ప్రజలకు సేవ చేయాలి కదా? మారుమూల ప్రాంతాలలో పని చేసే ఉపాధ్యాయులు పాఠశాల కు సరిగా  పోరు.వంతుల వారీగా వెళతారు. వారి ప్రజలను అభివృద్ధి పరచాలనే కోరిక ఉన్న వారు ఆ పల్లెలోనే ఉండి , ఆ విద్యార్ధులకు తమ జ్ఞానాన్ని, తల్లి దండ్రులకు ఉన్న దురలవాట్లు మాన్పించి, వారిని చైతన్య వంతులను చేసి అభివృద్ధి పరచవచ్చు గదా ! రోగాలతో బాధపడుతున్న ప్రజలకు సరైన సమయానికి వచ్చి సేవలు అందించవచ్చు గదా !( ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు లేక పోయినా నకిలీ డాక్టర్ ల బారిన పడకుండా సరైన అవగాహనా కల్పించవచ్చు గదా ! వారు క్షేత్ర స్థాయిలో పని చేసి ప్రజలకు సేవచేయడానికి , ఏ  ఆంధ్ర దోపిడీ దారు అడ్డుపడడుగదా !

   నేను చెప్పొచ్చే దేమిటంటే .. ఎవడు దొంగ, ఎవడు దొర  అని కాదు. వ్యాపారం చేసుకునేవాడు ఒక రూపాయి సంపాదించుకుంటాడు. నిరుద్యోగి త్వరగా ఉద్యోగం రావాలనుకుంటాడు.  ఉద్యోగస్తుడు త్వరగా ప్రమోషన్ రావలనుకుంటాడు.దీనికి ప్రాంతంతో, కులంతో,మతంతో సంబంధం లేదు. ఎవడికి ఓపిక ఉంటే, వాడే కొడతాడు, సాధిస్తాడు.

ఉపసంహారం: అయ్యా! నేను తెలంగాణా వ్యతిరేకిని కాను . ఎవరి అభిప్రాయం వారిది. వ్యక్తిగతంగా నా  అభిప్రాయంలో తెలంగాణా ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే! అక్కడైనా ,ఇక్కడైనా  సామాన్యునికి ఒరిగేదేమీ లేదు. వ్యవస్థలో సమూలంగా వచ్చే మార్పులు ఉండవు. కాకపోతే కొందరు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.

2 comments:

  1. ఇటువంటి వాదనలన్నీ చేసి చేసి అలసిపోయారండీ చాలామంది బ్లాగ్ లోకంలో.

    ReplyDelete
  2. Chala baga rasarandi. Nenu Sircilla, Karimnagar DT, vanni. Meerannavi akshara satyalu. Manushullo kulalavariga prantalavariga manchollu, cheddollu ani vundaru. Nenu puttindi perigindi remote Telanganalo, job kosam Anantpur, Vijayawada lo vunnanu. I always was at home in all these places. I hope and pray that we will be united forever.

    ReplyDelete