Sunday, March 3, 2019

అమర గురు మందిరము


అమర గురు మందిరము

      ధరణికోటను పరిపాలించిన జమీందారుల లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ముఖ్యులు. నాటి కృష్ణా, గుంటూరు జిల్లా లలో ఉన్న జమిందారులందరిలో ఆయనే  ప్రముఖుడు.  నాటి కృష్ణా తీరంలో ఉన్న అచ్చంపేట, బెల్లంకొండ, పులిచింతల, కేతవరం, అమరావతి వంటి ప్రాంతాలలో చిట్టడవులు ఉండేవి‌. ఈ కారణాన అటవీ ప్రాంతంలో నివసించే బోయలు, చెంచులు ఈ ప్రాంతంపై పట్టు కలిగి ఉండేవారు. బోయలు వెంకటాద్రి నాయుడు కొలువులో చేరి ఉద్యోగాలు చేసేవారు.
     చెంచులు అడవుల్లో ఉంటూ జనావాసాల పైబడి దోచుకుంటూ ఉండే వారు. దారి దొపిడీలు వీరి నిత్యకృత్యంగా ఉండేవి. చెంచులు దారి దోపిడీలు చేస్తూ, ఊళ్ల పైబడి దోచుకుంటున్నారని, వారి బారి నుండి కాపాడాలని రాజా వారికి విన్నవించు కున్నారు ప్రజలు. వెంకటాద్రి నాయుడు అనేక సార్లు చెంచు మూకలను చిక్కిన వారిని చిక్కినట్లు హతమార్చినా తక్కిన వారు దోపిడీలు చేస్తూనే వచ్చారు. సంస్థానం లోని కొందరి సూచన పై వెంకటాద్రి నాయుడు దారుణానికి ఒడిగట్టాడు.
     ఒక పర్వ దినాన సమారాధన జరిపి, పెద్ద ఎత్తున సంతర్పణ లు పెట్టి, అందరికీ విందుకు ఆహ్వానాలు పంపాడు. ఈ విందుకు చెంచులను కూడా ఆహ్వానించాడు.విందుకు హాజరై భోజనం చేస్తున్న సమయంలో వెంకటాద్రి నాయుడు చెంచుల్ని నరకమని అంతకు ముందే ఆదేశాలిచ్చారు.వీర సింగు, రామ సింగు, భద్ర సింగు, భుజంగ రాయ్, కాళోజీ, రామోజీ, నర్సోజి అను మరాఠా వీరులు చెంచుల పై బడి ఒక్క సారిగా తలలు తెగ నరికారు. క్రీ. 1791 లో చెన్ను పాపయ్య నాయకుడి ఆధ్వర్యంలో దొంగల ముఠాను కూడా సంహరించి నిజాం నవాబు చే మన్నె సుల్తాన్ అను బిరుదు కూడా పొందాడు.(భోజనం లో విషం కలిపి చంపాడు అని జన వాక్యం.)
     రాజా వాసరెడ్డి వెంకటాద్రి నాయుడు చివరి రోజుల్లో పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు. చెంచుల ను విందు భోజనం చేస్తున్నప్పుడు సామూహికంగా నరికి చంపడం పాప కృత్యంగా భావించాడు. అన్నము సహించ రానిదై పురుగులవలే ఉండేది. నివారణోపాయంగా ఆస్థాన సిద్ధాంతుల సూచన మేరకు తన రాజ్యమంతటా, 108 శివాలయాలు నిర్మించాడు. అనేక క్షేత్ర నిర్మాణములు, లింగ ప్రతిష్ఠ లు, గోపురాల నిర్మాణాలు, ఆలయ పునరద్ధరణలు, చేస్తూ పల్లెల్లో కూడా ఆలయ నిర్మాణం చేసి,వాటి మనుగడ కోసం భూములు, భూరి విరాళాలు ధన, కనక, వస్తు, వాహనాలను దానంగా ఇచ్చాడు. బ్రాహ్మణ పౌరోహిత్య వర్గాలకు అగ్రహారాలు, మాన్యాలు ఇచ్చాడు. అయినప్పటికీ నివృత్తి కాలేదు. ఒక నాటి రాత్రి అమరేశ్వర స్వామి వారి సన్నిధానం లో ఉండగా ఒక సాధు పుంగావుడు ఆలయ ప్రాంగణం లో ఎదురు పడ్డాడు. వెంకటాద్రి నాయుడు వారిని ప్రార్థించి తన బాధను వివరించి తరుణోపాయం చెప్పమన్నా డు. అంతట ఆ సాధువు "అయ్యా! త్రి పురాంతకం నందు  దైవ స్వరూపులు అయిన నాసర్ మహమ్మద్ గురు దేవులు ఉన్నారు. వారిని ఆశ్రయించి వారిచే గురు మంత్రోపదేశం పొందండి. మీ కర్మ నివారణ అవుతుంది" అని సెలవిచ్చారు. 
            అంతట రాజా వారు మరునాడు త్రిపురాంతకము నకు ప్రయాణ సన్నాహం గావించి, తన ఆంతరంగిక సిపాయి అమరయ్యను వెంటబెట్టుకుని నాసర్ మహమ్మద్  గురు దేవుల ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమమున ప్రవేశించగానే అమరయ్య , నాసర్ స్వామి వారి ముఖ్య శిష్యుడైన పుల్లయ్యను కలిసి రాజా వారి విషయాన్నీ పూస గుచ్చినట్లు వివరంగా చెప్పాడు. రాజా వారికి ఉచిత మర్యాదలు అందించారు. మిగిలిన శిష్యులైన ఓబులదాసు, దండె సుందరమ్మ, వీర రాఘవయ్య, సుబ్బారెడ్డి, గోవిందాచార్యులు గురువు గారికి రాజా గారి విషయం తెలియ జేశారు. రాజా వారి దీన స్థితిని అవలోకించిన గురు దేవులు, గురు మంత్రం బోధించడానికి అంగీకరించి, ఒక ముహూర్తం నిర్ణయించి, సతీ  సమేతంగా-రమ్మని-సెలవు-ఇచ్చారు.

     గురుదేవులు ఇచ్చిన సమయానికి ప్రయాణ సన్నాహాలు జరుగుతుండగా ఆస్థాన పండితులు ఈ విషయమై మధన పడి, రాజా వారు మహమ్మదీయుని వద్ద మంత్రోపదేశం స్వీకరిస్తే తమ విలువ తగ్గుతుందని భావించి, ఎలాగైనా ఈ ప్రయత్నం భంగపరచవలెనని సంకల్పించి రాణి గారికి దుర్భోధలు చేసి వారి చేత అబద్ధము లాడించి ప్రయాణమునకు వీలు పడదని రాజా వారికి  కబురు పంపించారు. రాణి గారి వర్తమానం విన్న రాజా వారు హతాశుడై ప్రయాణం రద్దు చేయించి, తన ఆంతరంగిక సిపాయి అయిన అమరయ్యను పిలిపించి, అయనచే నాసరు  గురు దేవులకు వర్తమానం పంపించారు .

     అమరయ్య తెచ్చిన వర్తమానం విన్న గురువు గారు అలోచించి, "అమరయ్యా! ఈ మహద్భాగ్యము నీ సొమ్ము. అందుకే నిర్ణయించిన ముహూర్తానికి నీవు వచ్చావు. గురుధనం నీది . కైవల్యం నాది. జనన మరణ రహితుడవు నీవు అంటూ ముందుగా నిర్ణయించిన ముహుర్తమునకు అమరయ్య కు మంత్రోపదేశం చేసారు.

     అమరయ్య కు పూర్వ జ్ఞానం వచ్చింది. నరుడు గా పుట్టి ఏం  సాధించాలని వచ్చాడో, వచ్చిన పని గుర్తుకు వచ్చింది. జన్మ రహిత మార్గానికి త్రోవ దొరికింది. గురువును సేవించుచూ, గురు బోధ వింటూ సాధన సంపత్తి తో పంచాక్షరీ, అష్టాక్షరీ , ద్వాదశాక్షరి , షోడశాక్షరీ  మంత్ర రహస్యాలు తెలుసుకున్నాడు. పంచీకరణ , నేత్ర పంచీకరణ , తారక సూత్రం , స్థూల, సూక్ష్మాకార, మహాకారా శరీర వ్యత్యాసాలు తెలుసుకున్నాడు. బోధ రూపక మైన ద్వాదశి లో మునిగి పోయాడు. నిత్యం భిక్షాటనకు వెళ్లడం, ఆహారం సేకరించి ఆశ్రమానికి వచ్చి గురు సమర్పణ చేయడం , గురువు చేతి ప్రసాదం తిని , గురు పాదములు సేవించి , గురు తీర్ధము తీసుకొని గురు ప్రసంగాలు ఆలకిస్తూ, పన్నెండు సంవత్సరములు గురు సేవలో మగ్గి పరి పూర్ణుడు అయ్యాడు.

        అమరయ్య గారికి నాసరు  గురువు గారి వద్ద దీక్ష తీసుకొనక ముందే తన మేన మామ కుమార్తె తో వివాహం అయినది. ఏ రోజు కూడా తన వివాహం గురించి గురువు గారి వద్ద ప్రస్తావించలేదు.  ఒక నాడు అమరయ్య మామ గారు కూతురిని వెంట బెట్టుకొని ఆశ్రమానికి వచ్చాడు. జరిగిన విషయం నాసరు  గురు దేవుళ్లకు విన్నవించగా, గురు దేవులు అమరయ్యను పిలిచి కర్తవ్య బోధ చేసారు.   "నాయనా! అన్ని యోగములలో రాజా యోగము మిన్న. సంసారం జీవితము సాగిస్తూ, విద్యుక్త ధర్మాన్ని విస్మరించ కుండా మనుగడ సాగించు. గురువుగా నీకు అధికార మిస్తున్నాను. గురు ధర్మాన్ని పాటించు. నీ వంతు గురు మార్గం కొందరి కైనా చూపించి ముక్తి మార్గ దర్శకుడివి కమ్ము. నీ ఆశ్రమం నాదెండ్ల గ్రామమున ముచికుంద  గట్టున ఒక కర్మ రహితుడు నెలకొల్ప గలడు . అతనికి జనన, మరణ   రహస్యాలు తెలియపరచి, భ్రాంతి రహితుని చేసి, సజీవ సమాధి యోగమున నిత్యుడవై నిలిచి యుండు" అని ఆశీర్వదించి పంపాడు.   మరునాడు గురు శిష్య కూటమి నందు అమరయ్య గారిని అమర గురునిగా అభిషేకించారు. అమర గురుడు సహా చరులకు వీడ్కోలు పలికి గురువు గారికి ప్రదక్షిణాలు చేసి స్వగ్రామము చేరుకున్నారు.

     అమరయ్య గారిలో వచ్చిన ఈ కొత్త మార్పు గమనించిన జనులు, ఆయనను గౌరవించి గురువు గ పిలవ సాగిరి. కొన్ని రోజులు గడిచిన తరువాత అమరయ్యకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టు అంధుడు. అమరయ్య చింతించలేదు గురు నాసరార్యులను సందర్శించి పూజ విధులు గావించి వారి పాద ధూళి తీసుకు వచ్చి కుమారుని నేత్రములకు పూతగా రాసి, గురుని యందు దృష్టిని నిలిపి ధ్యానంతో ఉన్నాడు. గురు పాద  ధూళితో పసివాని కనులు సూర్య రశ్మి సోకిన పద్మముల వలే తెరుచుకున్నవి.
 
     సద్గురు పాద ధూళి చాలు మన జన్మ లను ఉద్ధరించ డానికి అని చెప్పే గొప్ప నిదర్శనము ఈ సంఘటన. అమరయ్య గారు కుమారునికి గురు పాద రేణువు అని నమ కారణం చేసినారు. అయన తీర్థ  యాత్రలు చేయుచు దారిలో తనను అనుసరించిన శిష్యులకు మంత్రోపదేశము చేయుచూ , వారిని ఉద్ధరిస్తూ మహా శివరాత్రి నాటికీ శ్రీశైలం చేరుకున్నారు.

     అక్కడ శిష్యులతో సత్సంగం కావిస్తూ ఉండగా,  ఒక వ్యక్తి నేరుగా అయన వద్దకు వచ్చి, పాదములంటి  ఇలా అన్నాడు ," గురువర్యా! మాది నరసరావుపేట తాలూకా నాదెండ్ల గ్రామము. నేను గంగవరపు చింపయ్యను . నరజన్మ రహితము కొరకు ఒక గురువు కావలెనని, గురువును సేవించవలెననీ, ఆ సేవలో జన్మ తరించవలెననీ, చాల చోట్ల వెతికితిని. చివరకు కోటప్ప కొండలో మీ సహపాఠి ఓబులదాసు గారు మీ రూపు రేఖలు వర్ణించి, మీ గొప్పదనం వివరించి, మీ దరి చేరమని సూచించారు. అమర గురులు మీరే కదా ?". ఈ మాటలు విన్న శిష్యులు ఆశ్చర్య పోయారు.

     అమర గురులు ఆ క్షణం లోనే చింపెయ్యకు మంత్రోపదేశం చేసారు. గురు చర్యకు శిష్యులంతా విస్మయం చెందారు. వారి సందేహం తీర్చుతూ గురులు ఇలా అన్నారు, "అయ్యలారా! ఇతడు గురుసేవ చేయకనే మంత్రోపదేశం చేశాననే సందేహం మీకు అక్కరలేదు. ఇక్కడ నుండి ఇతడు  గురు సేవకు అంకితం . గురు స్థానం అలంకరించి దాగిన యోగ్యుడు. అందుకే మంత్రోపదేశం చేయవలసి వచ్చినది. అతని ముహూర్తం చేరువైనది అని అన్నారు. శిష్యులంతా చింపయ్యను  తేరి పార  చూసి, గురువు గారు చెప్పిన మాటలు యదార్థం అనిపించి అక్షింతలతో దీవించారు.

     చింపయ్య  శిష్య కోటి లో చేరి గురు శుశ్రూష చేయ సాగాడు. ఒకనాడు గురు పాదములు పట్టి అమర గురునితో ," గురుదేవా ! మీరు మా గ్రామము నాకు రావాలి . మమ్ములను ధన్యులను చేయాలి . మీకు ఆశ్రమము ఏర్పాటు చేస్తాను అని ప్రాధేయ పడ్డాడు.అమర గురుడు చింపయ్య  ప్రార్ధన మన్నించి, శిష్యులకు  వీడ్కోలు పలికి నాదెండ్ల గ్రామానికి పయనం అయ్యారు . మార్గ మధ్యమము అనేక గ్రామాలూ దర్శిస్తూ గురు బోధ చేస్తూ , నాదెండ్ల గ్రామము చేరుకున్నారు.  చింపయ్య  కొందరు భక్తులను పరిచయం చేసాడు. సత్సంగం ప్రారంభం అయినది. మరుసటి రోజున అమర గురుని గ్రమ్మ పెద్ద అయినా స్వామి గారి వద్దకు తీసుకు వెళ్ళాడు. మచ్చు గట్టు ప్రాంతం దగ్గరగా ఉన్న స్థలం కొంత గురువు గారి ఆశ్రమ నిర్మాణం కొరకు ఇవ్వాలని కోరగా, అమర గురుని వాగ్ధాటి, బోధనా సరళి, గీతరావళి  ఆలకించి స్థలం విభజించి ఇచ్చాడు.  ఆనాటి నుండి సత్సంగములు జరగడం మొదలైంది.

     అమర గురువు నాసరు  వద్ద అభ్యసించిన బోధ, జనన, మరణ రహస్యములు, అచల పరిపూర్ణ బోధ వివరిస్తూ ఉన్నాడు. చింపయ్య మచ్చు గట్టు ప్రాంతమున గల స్థలంలో కంచెలు తెగ నరికి, రాయి రప్పా  సవరించి, చిన్నపాటి కుటీరం ఏర్పాటు చేసి గురు కుటుంబమును సేవిస్తూ ఉన్నాడు. కుటీరం ముందు ఒక నిమ్మ మొక్క నాటాడు . అది మనిషికి మించి ఎదిగింది. గొడుగులా విస్తరించింది. ప్రతి రోజు ఆ చెట్టు కింద కూర్చొని అమర గురుడు శిష్యులకు బోధ చేసేవాడు.
     ఒకనాటి సాయం సమయమున అకాల వర్షం మొదలైంది. పది మంది శిష్యులతో గురువు గారు చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వర్షం పెద్దదయ్యి నీరు ప్రవహిస్తూ వస్తున్నది. నీరు నిమ్మ చెట్టుకు అల్లంత దూరం లోనే విడిపోతూ ఉంది. నిమ్మ చెట్టు ఇంటి కన్నా పదిలంగా ఉంది. శిష్యులకు ఆశ్చర్యం. గురువు గారి చిన్న పూరి పాక(ుటీరం ) అంత  హోరు గాలిలో కూడా కదలకుండా ఉంది. తెల్లవారే వరకు చెట్టు కిందనే ఉన్నారు. అమర గురు మహిమ ఊరంతా పాకింది. పొగడ్తలకు పొంగని వాడు, నిరాడంబరుడు, తపోశీలి అయినా అమర గురుడు  చింపయ్య  పొగిడినా  దానిని పట్టించుకోలేదు. కొలది కాలమునకు చింపయ్య  గట్టి ఆశ్రమము నిర్మించాడు. గురువు గారితో పా టు ఆశ్రమం లోనే గడిపేవాడు.
   ఒకనాటి ప్రసంగం లో గురువు గారు చింపెయ్య కు తగిలే విధంగా ఒక కథ వ్యాఖ్యానించారు. " కోడి జన్మించి తన తల్లి నుండి వేరై తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది . కానీ  మానవులు  తల్లి దండ్రులు మరణించు వరకు వారి రెక్కల మాటున దాగి ఇంటిని వీడనేరరు." ఈ మాటలు విన్న చింపయ్య ఆలోచనలో మునిగి పోయాడు . నేను ఇంత కాలం గురు సేవల ఫలంగా జనన, మరణ, రహస్యాలు తెలుసుకున్నాను. అశాశ్వతమైన ఈ లోకం లో తాను వచ్చిన పని అయి పోయినదని గురువు గారి తనువు  చాలించ మంటున్నారా ? లేక ఇంకేమైనా ఆదేశమిస్తున్నారా? అనే ఆలోచనతో చింపయ్య  మనసు తర్జన భర్జన పడుతుంది. చింపయ్య ఆలోచనను గ్రహించిన అమర గురువు "ఏం  చింపయ్యా ! ఆలోచిస్తున్నావు ? ఆశగాన లేదా? లేక నీవు సంపాదించిన ధనం పది మందికి పంచడానికి మనసు సహక రించడం లేదా ?" అని ప్రశ్నించాడు .ఆ రాత్రి చింపయ్య కు సరిగ్గా నిద్ర పట్టలేదు . నేర్చిన విద్యతో నలుగురిని ధన్యులను చేయమని గురువు గారు తనను ఆదేశిస్తున్నారా ? అని అనిపించింది. అదే సమయానికి ," రెక్కలు వచ్చిన పక్షి ఎగరడం ధర్మం, తన మూలంగా పది మందికి ముక్తి కలిగించడం కర్తవ్యం , వచ్చిన పని ముగిసింది. స్వార్ధ చింతన తగదు. అగాధమున ఉన్న వారిని చేతనైనంతవరకు  దరి చేర్చడం గురు ధర్మం " అనే మాటలు చింపయ్య  చెవిలో మారుమోగినట్లు-అనిపించింది.    

     తెల్లవారుతున్నా చింపయ్య కార్యక్రమాలు ప్రారంభం కాలేదు .తెల్లవారిన అయన జాడ  లేదు. బిడ్డలు గురువు గారిని కలిశారు. గురువు గారు ధ్యానం లో ఉన్నారు. బంధువులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చింపయ్య  ఆచూకీ దొరకలేదు. చింపెయ్య గారు అడ్డంకి సమీపాన ఉన్న ఒక గ్రామం చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు తత్వ బోధ చేసాడు. అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడ్డారు. పన్నెండు సంవత్సరాల పాటు పరిసర గ్రామాల ప్రజలకు గురూపదేశం ఇచ్చి-వారిని-ఉద్దరించాడు.

   అమర గురుడు  ఒకనాటి గురు శిష్య కూటమి లో తాను సమాధిని చేరబోతున్నానని ప్రకటించాడు. ఆ మాట కొందరికి ఉలికి పాటు కలిగించింది. కొందరికి హాస్యాస్పదమని అనిపించింది. మరి కొందరికి గుబులు గుబులుగా ఉంది. ఆశ్రమ బాధ్యతలు  పాదరేణు  గారికి అప్పగించి  పీఠాధిపతిని  చేసి గ్రామ పెద్దల అంగీకారం అడిగారు. వారు ఒప్పుకోలేదు.

         వీరితో సంబంధం లేకుండా తాను చేయ వలసిన పనిని నిర్వర్తించాలని సంకల్పించారు . అమర గురుడు చాకలి ముసలప్పను, వడ్డెర సుబ్బయ్యను , మాదిగ కాటయ్యను పిలిపించి జరుగ వలసిన దానిని వివరించాడు. ఏకాదశి నాటి వేకువ జామున వడ్డెర సుబ్బయ్య సమాధి తవ్వగా, చాకలి ముసలప్ప సమాధి అలికాడు. అమర గురుడు నూనె మూకుడు లో వట్టి వేసి జ్యోతి  వెలిగించాడు . ప్రదక్షిణ చేసి నమస్కరించి, వారితో " నేను వచ్చిన పని పూర్తి  అయినది . నేను సమాధి లోకి వెళ్ళు  వరకు పాద రేణుకు కూడా ఈ రహస్యం  తెలియ రాదు. నా అంతిమ యాత్ర లో నా కుమారునికి, గ్రామ ప్రజలకు దక్కని భాగ్యం మీకు దక్కింది. 12 సంవత్సరములు గురు సేవ చేసిన సిద్దప్పకు బ్రహ్మం గారు ఇవ్వని భాగ్యము మీకు దక్కింది. మీ జన్మము చరితార్ధము.  మీరేమి కోరకండి . కోటి వ్యధలకు కోరికలే మూలము. అవి తీరకనే  కోటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. రానివి రావు, రావు, రావు. . పోనివి పోవు, పోవు, పోవు. లేనివి లేవు, లేవు,లేవు. రావడం పోవడం కాదు మానవ జన్మ కర్తవ్యం . వచ్చిన పని వేరవేర్చుకోవడం.

     జన్మ రహితమై వచ్చిన మానవుడు మాయ యందు చిక్కి పలు బాధలు అనుభవించి,పలువురిచే దూషించబడి, పదుగురికి ఉపయోగ పడక , చివరకు తనకు తాను ఏమౌతాడో ? ఎండిన ఎముకతో చితిలో   దేహం తగులబడగా, జీవుడుండు తావు దొరకక , జీవిఘోషించిఅఘోరించి మరల ఎదో నికృష్ట  దేహం లో చొరబడును. అందు పడరాని పాట్లు పడి  మరణించి, మరియొక దిక్కు మాలిన దేహాన్ని ఆశ్రయించ వలసి వస్తుంది. ఇదేనా జన్మకు అర్ధంఇదేనా పలు జన్మల ఫలం?జీవన్ముక్తి ఎప్పటికిమీకు ఈ అవకాశం ఎన్నో జన్మల పుణ్య ఫలం . మతి చలించిన  మానవుడు ఒక  పని నిమిత్తం బయలు దేరి, పని స్థలం చేరుకొని, మతి మరుపు గలిగి , మరల తిరిగి వచ్చి, మరల గుర్తుకు వచ్చి, అచటకేగి, మరలా  మరిచి, తిరుగు విధమున మరల మరల పుట్టి చచ్చు  దురవస్థ మీకు తీరింది."
     "చాకలి పాదమెక్కడ మోపినా  చల్లన"  అని చాకలి ముసలప్ప తో అమర గురులు అన్నారు.  "నేను సమాధి ప్రవేశించిన తరువాత మాదిగ కాటయ్య మూత  బండ వేస్తాడు. బండ  చుట్టూ అలికి దీపం దానిపై ఉంచుము. మీరు ముగ్గురు నా  పాలిట త్రిమూర్తులు . నేను వెళ్లిన తొమ్మిదవ రోజు చింపయ్య  నా సమాధి వద్దకు వస్తాడు . నేను ఇచ్చే ఈ విభూది చింపయ్యకు ఇచ్చే భారం కాటయ్యది". అంటూ కాటయ్య చేతికి ఇచ్చి చివరగా," గ్రామస్తులకు నా మాటగా చెప్పండి ,నిండు కుండ అన్నంలో తొలి ముద్ద నాది ." అన్నారు అమర గురులు.
 ఈ విధంగా చెప్తూ జై సద్గురు మూర్తికి అన్నారు అమరయ్య గారు. ముగ్గురు జై అన్నారు . రెప్ప పాటులో సమాధి లోకి ప్రవేశించారు అమరయ్య గారు. సమాధి అంతా  కాంతి మయం . చూడలేని కాంతి. గుండె నిబ్బరం చేసుకొని గురుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని, బండ  వేసి అలికి, జ్యోతి పెట్టి ముగ్గురు వెళ్లిపోయారు.
         
  నాటి నుండి ఆశ్రమం లో సంవత్సరానికి ఒక రోజు , ఆరాధన గురు పాద రేణువు గారి ఆధ్వర్యం లో జరిగింది. తరువాత గురు పాద  రేణువు గారి అనంతర కాలం లో పీఠాధిపతి గా  కందులవారిపాలెం వాస్తవ్యులు బూతుకూరి గురువారెడ్డి గారు నియమితులయ్యారు. ఆ తరువాత నాసర రెడ్డి గారు , తదనంతరము బూతుకూరి  నారాయణ రెడ్డి గారు  ఆశ్రమ పీఠాధిపతిగా వ్యవహరించారు. 


No comments:

Post a Comment