Monday, October 15, 2012

బాదం మొక్క జీవన పోరాటం

చిలకలూరిపేట లోని సి .ఆర్. కాలనీ పార్కు లో కాలనీ వాసులు వాకింగ్ చేస్తూ ఉంటారు.కొత్త గా అభివృద్ధి పరిచిన ఈ పార్కులో  ఈ మధ్యనే మొక్కలు కూడా నాటారు. వర్షాలకు మొక్కలు బాగా ప్రాణం పోసుకున్నాయి. పచ్చని వాటి చిగుళ్ళు చూసి అందరికి హయిగా అనిపిస్తుంది. అయితే వాటిలోని ఒక బాదాం మొక్క ఒక మీటరు పెరిగాక, గొర్రెలు ఆకులు, చిగురు తుంచి తిన్నాయి. అయినా  మొక్క లెక్క చేయకుండా మరలా  చిగురు వేసింది.అప్పటి నుండి  గొర్రెలు, గేదెలు రాకుండా కట్టడి చేసారు. .

నాలుగు ఆకులు వేసాయో లేదో దానికి మరో దెబ్బ. నడిచే వాళ్ళ కాలు తగిలిందో, ఆడే పిల్లల చేయి తగిలిందో,మొదలు దగ్గర విరిగి చీలింది. అలాగే ప్రాణం అర చేతిలో పెట్టుకుని జీవితం మీద ఆశ  కోల్పోకుండా ఉన్న నాలుగు  ఆకులకు మరో నాలుగు ఆకులు  జత చేసింది.   ఉదయ కాంతి  రేఖలు సోకి పచ్చగా  మిస మిస లాడుతున్న  ఆ మొక్క ఆకులు చూసి అందరికీ  ఆనందం.. ఆ మొక్క బాగా ఎదిగితే బాగుండన్న కోరిక...మొదలు కంటూ విరిగి కూడా బ్రతకాలన్న దాని కోరిక చూసి ఆవేదన. 

పార్కు చుట్టూ పది రౌండ్లు కొట్టే నాకు ఆ మొక్క దగ్గరికి రాగానే చూపంతా దాని మీదే ఉంటుంది. విరిగిన మొదలు కి కింద చిన్న చిగురు 2 రోజుల క్రితం  గమనించాను. అమ్మయ్య! ఆ మాత్రం చాలు జగ్రత్తగా  కాపాడుకొస్తే అది పెరుగుతుంది అని అనిపించింది. నిన్న మొక్కలకు నీళ్ళు  పోస్తున్నారు పెద్దలు. అన్ని మొక్కలతో పాటు ఈ బాదాం మొక్కకు కూడా పోసారు. 

ఈ రోజు గమనించాను ఆ మొక్కని యధాలాపంగా .. నిన్న  జగ్గు తో ధారగా మీద పడ్డ నీరు మొక్క నడ్డి మళ్ళీ  విరిచి నట్లు గమనించాను. విరిగిన మొదలు కింద ఉన్న చిగురు మీద  నీటి ధార పడటం వల్ల అది తునిగి పోయింది. కానీ ఆ బాదాం మొక్క మాత్రం విరిగిన మొదలు పైన ఉన్న ఆకుల కళ  తప్పనివ్వలేదు,  బ్రతుకు మీద ఆశ  వీడినట్లు కనిపించలేదు. ఎంత నేర్చుకోవాలి ఈ మొక్క నుండి....!!

నేను సైతం అన్నట్లు ..ఆశ  పుట్టింది. ఇంకాస్త మొదలు తవ్వితే అది మరలా చిగురు  వేస్తుందేమో  ( తప్పకుండ వేస్తుంది) అనిపించింది. మొదలు దగ్గర తవ్వాను.రెండు అంగుళాల మొదలు ఉండేలా మట్టి తీసాను.అక్కడ గోరుతో చిన్న గాటు పెట్టాను( అక్కడ మరొక చిగురు పెడుతుందేమో అని  ! అవునో? కాదో? తెలియదు).చుట్టూ చిన్న పాది చేశాను.అది పెరుగుతుందన్న నమ్మకం మాత్రం పదిలంగా ఉంది. దానిలో ఆ ఆత్మవిశ్వాసం కనపడుతూ ఉంటుంది  అప్పుడూ ...ఇప్పుడూ ..ఎప్పుడూ ..!!   

4 comments:

  1. చక్కగా రాసారు. నిజమేనండి . మొక్కల నుంచి ఎన్నో నేర్చుకోవాలి. మొక్క జీవించాలని మీరు పడుతున్న తాపత్రయం అభినందనీయం. అది పెరిగి పెద్దయితే ఎందరికో నీడనిస్తుంది.

    మొక్క మొదలు దగ్గర విరిగి చీలిన భాగాన్ని , అతి నెమ్మదిగా దగ్గరికి చేర్చి, చిన్న గుడ్డపేలికతో కలిపి దారంతో కడితే, తిరిగి అతికి , మొక్క మళ్ళీ ఇంతకు ముందులా ఉంటుందనిపిస్తుందండి.

    ( చిన్న మొక్క కాబట్టి , ఇలా కట్టేటప్పుడు పూర్తిగా విరిగిపోకుండా నెమ్మదిగా కట్టాలి. )

    ReplyDelete
  2. ఇందాక రాయటం మర్చిపోయాను. మొక్కకు సపోర్ట్ గా చిన్న కర్ర ముక్కను పాతి తాడుతో మొక్కకు కడితే గాలికి ఊగి మొక్క విరిగిపోకుండా ఉంటుంది.

    ........నాకు తెలిసినంతలో చిగురు రావటానికి గాటు పెట్టరండి.

    ReplyDelete
  3. mee sunnitha hrudhayaniki hats off. Mokka present situation emi ayindhi?

    ReplyDelete