ప్రారంభం: 08-09-2013
పిరమిడ్ కొలతలు : 20X 20X 18
జ్యోతి ప్రజ్వలన : శ్రీ లక్ష్మణ రావు గారు, MLC
ప్రారంభకులు : శ్రీ K .V. రావు గారు , మాస్టర్ , వైజాగ్
పిరమిడ్ ను నిర్మించి నిర్వహిస్తున్నది నాదెండ్ల గ్రామస్తులైన సలిశం ఆంజనేయులు, లక్ష్మి పద్మ దంపతులు. ఆంజనేయులు గారు దక్షిణ ఆఫ్రికా లో ఒక సిమెంట్ కంపెనీ లో ప్రాసెస్ మేనేజర్ గా పని చేస్తున్నారు . వారికి ఇద్దరు సంతానం . పిల్లల చదువుల నిమిత్తమై వారు విజయవాడలో ఉండే వారు. వారి పాప పావని మెడిసిన్ చదువుతున్నది. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దురదృష్ట వశాత్తు మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం లో మరణించాడు . కొడుకు చనిపోవడంతో తీవ్రమైన దుః ఖం లో మునిగి పోయారు ఆ దంపతులు . పుత్ర వియోగం నుండి తేరుకోలేక పోయిన ఆంజనేయులు గారిని ధ్యానం చేయమని సలహా ఇచ్చారు తెలిసిన వారు .
మార్పు కొరకు అన్నట్లు బెంగళూరు లోని పిరమిడ్ వాలీ లో 41 రోజుల ధ్యాన శిక్షణ కు వీరు వెళ్ళటం జరిగినది . ఆంజనేయులు గారు అక్కడ ధ్యానం లో పూర్తిగా లీనమై అనుభూతి పొందారు. ధ్యాన శిక్షణ పూర్తీ అయ్యే నాటికి పిరమిడ్ ధ్యానం లో చెప్పే 'ఆనాపాన సతి ' అనగా "శ్వాస మీద ధ్యాస నిల్పుట "ను సాధించారు. మాములు మనిషి కాగలిగారు .
తను పొందిన అనుభూతి అందరికి అందించాలనే భావన కలిగి ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నారు . మొదట విజయవాడ లోనే ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, స్వగ్రామమైన నాదెండ్ల లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిలాషించారు . ఇప్పుడు పిరమిడ్ నిర్మించిన స్థల స్వంత దారులను కలిసి వారికి తమ ఆలోచన వివరించారు . వారికి స్థలం అమ్మే ఉద్దేశం లేనప్పటికీ వీరి సంకల్పానికి వారు స్పందించారు . పిరమిడ్ వరకు నిర్మిస్తే తరువాత నిర్వహణ కష్టం గా ఉంటుందని భావించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు, ఆ పైన మొదటి అంతస్తు లో పిరమిడ్ నిర్మించాలని నిర్ణయించారు . పదవీ విరమణ తరువాత ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో ధ్యానశిక్షణ తరగతులు నిర్వహించాలని అనుకుంటున్నారు .
ఈ మధ్యనే పిరమిడ్ నిర్మాణం పూర్తి అయింది . ఒక రోజు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి . ధ్యాన సాధకులు వెళ్ళి పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటున్నారు . ఇక త్వరలో 41 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు . ఈ కార్యక్రమాలను ఆంజనేయులు గారి శ్రీమతి లక్ష్మీ పద్మ గారు పర్యవేక్షిస్తున్నారు .
తాము ఏదైతే మంచి అనుభూతిని పొంది, బాధల నుండి విముక్తి అయ్యమో ఆ మంచి అనుభూతిని అందరికీ అందించాలనే సంకల్పం తోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దీనికి గ్రామంలోని ధ్యాన సాధకులు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు .
తాము పొందిన మంచిని అందరికి అందించాలనే సంకల్పం పెట్టుకొని దాని కొరకు అవిరళ కృషి చేస్తున్న ఆంజనేయులు దంపతుల ప్రయత్నం నూరు శాతం విజయవంతం కావాలని కోరుకొంటూ వారి నిస్వార్ధ ప్రయత్నానికి నాదెండ్ల ఆన్ లైన్ అభినందనలు తెలియ చేస్తుంది .
No comments:
Post a Comment