మన గ్రామంలో పిల్లలు, పెద్దలు అందరు ఇష్టపడే పండుగ తొలి ఏకాదశి. బహుశ పది సంవత్సరాల క్రితం ఈ రోజు గ్రామంలోని ఆడ వాళ్ళందరూ తెల్లవారుజామున చలం కొండలలో ఉన్న రామబుగ్గలో స్నానం చేసి, సీతమ్మ తోపులో ఉన్న మర్రి చెట్టు క్రింద ఉన్న పుట్టకి పూజ చేసి, తర్వాత ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, ఆ పూట కార్యక్రమం పూర్తి చేసేవారు. మీరందరూ వృత్తి, ఉద్యోగాల రీత్యా గ్రామాంతరం వెళ్ళటం, ఉన్న కుర్రాళ్ళు, పిల్లలు చదువులతో బిజీ కావటంతో ఈ మధ్య రామ బుగ్గ కు వెళ్లి స్నానం చేసే వారు కరువయ్యారుచలం కొండలు కూడా రాళ్ల కుప్పలుగా మారుతున్నాయి.
ఈ రోజు రాళ్ల తవ్వకం కాటంరాజు గుడి దగ్గరకు వెళ్ళింది. బహుశ మీరు మళ్లీ మన ఊరువచ్చేసరికి చలం కొండల్లో ఉన్న రెండు కొండల్లో దక్షిణం కొండం మిగలక పోవచ్చు. ఈ కొండల్లోని దొన(సొరంగం లాంటిది. దాని కింద మడుగులో నీరు) , సీతమ్మ అడుగులు , గొడుగు, దాని క్రింద శిధిల విగ్రహాలు ఉన్నాయి. ఇది వరకు సంతానం లేని దంపతులు వెళ్లి గొడుగు క్రింద కూర్చుంటే వారికీ పిల్లలు పుట్టే వారట
కొంతమంది పరిచయస్తుల తో రామబుగ్గలో స్నానాలు అని అనగానే సంతోషంగా కదిలి వచ్చారు. గత నాలుగైదు రోజుల నుండి వర్షాలు ఎక్కువగా కురియుట చే నడిచే దారి కూడా సరిగా లేదు. అయిన ఉత్సాహం తో బురద, కంప ముళ్ళు లెక్క చేయక కొండ ఎక్కి రామ బుగ్గలో పసుపు, కుంకుమ వేసి పూజ చేసి, స్నానాలు పూర్తి చేసారు. తరువాత కొండ దిగువున ఉన్న వినాయకుని పూజ చేసి కొందరు కొబ్బరి కాయలు సమర్పించారు. సీతమ్మ చెరువు గట్టునే పెద్ద మర్రి చెట్టు చూసారు కదా! పన్నెండు కొమ్మలతో ఉంది. పన్నెండు కొమ్మల మిద పన్నెండు పడుగల నాగమయ్య ఉండి కాపాడతాడని భక్తుల నమ్మకం. ఆ చెట్టు కిందనే పుట్ట ఉంది. ఆ పుట్టకు కూడా పూజలు చేసి తరువాత ఆంజనేయ స్వామిని దర్శించి, తమ తొలి ఏకాదశి పవిత్ర స్నాన కార్యక్రమం పూర్తి చేసారు.
దొన
తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే గ్రామం ఆలయాలకు, మఠాలకు భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా శివాలయం, వినాయకుని గుడి, అమరయ్య స్వామి మఠం . కొందరు కోటప్ప కొండకు వెళ్లి కోటయ్య స్వామి ని దర్శించుకున్నారు. హర హరో..! చేదుకో కోటయ్య..!
సాయంత్రం పూట మన గ్రామం లోని దేవాలయాలన్నిటిలో భక్తులు ఘనంగా భజనలు చేసారు. తొలి ఏకాదశి తరువాత రోజు పిల్లలందరికీ పండుగ రోజు. ఈ రోజునే హై స్కూల్ పిల్లలందరికీ సెలవు ఇవ్వటం తో, అందరు కొండపైకి యెక్కి అక్కడ బాగా ఆటలు ఆడారు. ఏది ఏమైనా చిన్న తనాన మీరు ఎంజాయ్ చేసినంతగా ఈ రోజు లేదనే చెప్పాలి.
నిన్న ఉపవాసం చేసిన వారు జాగారం చేసి ఉపవాసం పూర్తి చేసుకొని నేడు స్వామి వారికి నైవేద్యం ఘనంగా సమర్పించుకొన్నారు. ఎక్కువమంది మన సాంప్రదాయ వంటకాలు అయిన గారెలు, పూర్ణాలు మొదలైనవి చేసారు.
No comments:
Post a Comment