Wednesday, October 27, 2010

అట్లతద్దె - 25-10-10

అట్లతద్దోయ్ ఆరట్లోయ్
ముద్ద పప్పూ మూడట్లోయ్

పడకల కింద పిడికెడు బియ్యం
పిల్లలారా! జెల్లలారా! లేచిరండోయ్!!


హిందూ సాంప్రదాయ పండుగలు, వ్రతాలు వివరించే గ్రంధాలు ధర్మ సింధువు , నిర్ణయ సింధువు. గ్రంధాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో బహుళ పక్ష తదియను అట్ల తద్దె గా జరుపుకోవాలి. అట్లతద్దె కు శాస్త్రీయ నామం చంద్రోదయ ఉమా వ్రతం. వ్రతాన్ని కన్యలు, కొత్తగా పెళ్ళైన స్త్రీలు జరుపుకొంటారు. కన్యలు తమకు మంచి భర్త రావాలని, పెళ్ళయిన వారు తమ ఐదవ తనం క్షేమంగా ఉండాలని చేస్తారు.

వ్రతం ఆచరించేవారు తెల్లవారు జామునే లేచి అభ్యంగన స్నానం చేసి పెరుగన్నం తింటారు. తెల్లవారు జామున చిన్న పిల్లలను కూడా లేపి తలస్నానం చేయించి పెరుగన్నం పెడతారు. రోజు తెల్లవారు జాములో పెరుగన్నం తినకపోతే ముసలి మొగుడు, ముసలి పెళ్ళాం వస్తారని హాస్య మాడతారు. తర్వాత వేళ్ళకు గోరింటాకు పెట్టుకొంటారు. గవ్వల ఆటలు ఆడతారు. ఊయల ఊగుతారు. పగలంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రోదయం కాగానే చంద్రునికి, గౌరీ దేవికి పూజ చేస్తారు.పూజ అనంతరం ఏడుగురికి వాయినాలు అందజేస్తారు ( ఐదుగురు తద్దె తీర్చుకున్న ముత్తైదువులు, ఒకరు తీర్చుకోవాల్సిన ముత్తైదువు, ఒక పోతురాజు . పోతురాజు వీరిని ఊయల ఊపాలి).వాయనం అనగా పదకొండు అట్లు ఉంటాయి. అట్లు మందంగా పోయాలి, పలుచగా ఉండరాదు.

వాయనాలు అందించే విధానం:వాయనం ఇచ్చే వారు వాకిలి లోపల ఉంది ఇస్తినమ్మా వాయనం అని చెప్పి వాకిలి
బయట ఉన్న ముత్తయిడు చేతిలో పెడుతుంది. వారు పుచ్చుకొంటినమ్మ వాయనం అని చెప్పి తీసుకుంటారు. విధంగా ఒక్కొక్కరు మూడు సార్లు చెప్పి వాయనాలు తీసుకుంటారు. వచ్చిన పేరంటాల్లకు వాయనం, తాంబూలం ఇచ్చి భోజనం పెట్టడంతో వ్రతం పూర్తి అవుతుంది.

ధర్మ సింధు, నిర్ణయ సింధు మొదలైన గ్రంధాల ప్రకారం వ్రతాన్ని వరుసగా ఏడు సంవత్సరాలు ఆచరించాలి. కాలం, తిథి ప్రకారం వచ్చే పండుగలు వ్రతాలూ ఆయా రోజులలోనే చేయాలి. వ్రతాలను ఆచరించుటలో ఆరోగ్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామున తలస్నానం, పెరుగన్నం తినటం, పగలు ఉపవాసం, సాయంత్రం అట్లు తినడం మొదలయిన క్రియల వలన గర్భ దోషాలు తొలగిపోతాయని కొందరు చెబుతారు.

కాబట్టి ఉండ్రాళ్ళ తద్దె, అట్ల తద్దె మొదలైన వ్రతాలను పెళ్ళైన వెంటనే మొక్కుబడిగా ఆచరించక, శాస్త్రోక్తంగా ఆయా కాలాలలో ఆచరిస్తే మంచిదని పెద్దల అభిప్రాయం.

పై విషయాలను తెలిపిన వారు: శ్రీ కోదండ రామ స్వామి దేవాలయం (వెంకటేశ్వర స్వామి ఆలయం) ధర్మ కర్త, ఆగమ పండితులు శ్రీ పండా వెంకటప్పయ్య గారు.

No comments:

Post a Comment