నాదెండ్ల గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. గ్రామంలోని వివిధ ఆలయాలలో ఏర్పాటు చేసిన గౌరమ్మలను పది రోజులపాటు విశేషంగా పూజించి పదకొండవ రోజు జల్దిలో కలపడంతో ఈ పండుగ ముగిసింది.
గ్రామంలో పురాతన కాలం నుండి దసరా నవరాత్రులు ఘనంగా జరిగేవి. హరేరామ గుడిలో గౌరమ్మను ఏర్పాటు చేసి హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణులకు, గౌరమ్మకు విశేషంగా పది రోజుల పాటు వంతుల వారీగా పూజలు నిర్వహించారు. 1952 లో వీరాంజనేయ స్వామి గుడిలో అఖండ రామ సంకీర్తన ప్రారంభించి నిరాటంకంగా 12 సం.ల పాటు కొనసాగించారు. అందుకే ఆ గుడికి హరేరామ గుడి గా పేరు. ఆనాడు వారంలో ప్రతి రోజు వంతుల వారిగా భజనలు చేసేవారు. ఆనాడు ఏ రోజు ఎవరి వంతో ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు సేవలు చేసే విధంగా ఏర్పాటు చేసారు. ప్రతి రోజు ఉదయం విశేష పూజలు అర్చక స్వాములు నిర్వహించేవారు. సాయంత్రం పూట ముందుగా కొందరు భక్తులు ఆలయంలో విష్ణు సహస్ర నామం, భగవద్గీత, లలితా సహస్ర నామం లాంటివి పారాయణం చేసేవారు. ఆ కార్యక్రమం అనంతరం భజన కార్యక్రమం ప్రారంభమయ్యేది. ఈ విధంగా రాత్రి పదిన్నర గంటల వరకు భజన కార్యక్రమం జరిగేది. ఆ తర్వాత గుడి బయట ప్రసాదం పంపిణీ జరిగేది. ఎంతో పొద్దు పోయినప్పటికీ ప్రసాదం కొరకు భక్తులు వేచి ఉండటం విశేషం. ప్రతి రోజు దాదాపు 200 మంది వరకు చిన్న పిల్లలు, యువకులు, వృద్ధులు ఇలా వయోబేధం లేకుండా వేచి ఉండటం విశేషం. పది రోజుల పాటు పూజలు జరిపి పదకొండవ నాడు అమ్మ వారిని నాగవయ్య పడగ నీడలో ఉంచి గ్రామోత్సవం జరిపి, భక్తులందరికీ దర్శనం అందజేసి , గోవర్ధన స్వామి చెరువు పక్కనే ఉన్న పానకాల బావిలో నమజ్జనం చేయుటతో కార్యక్రమం ముగిసినది.
గౌరమ్మలు: పసుపు ముద్దలను చేసి గౌరమ్మలుగా భావిస్తారు. అక్కడే పూర్ణ కుంభమును ఏర్పాటు చేసి దానిలోకి గౌరీ, లక్ష్మి, సరస్వతి, తదితర దేవతలను ఆహ్వానించి పూజలు జరుపుతారు (పూర్ణ కుంభం విశిష్టత ఇదే). విజయదశమి నాడు అమ్మవార్లను మంత్రాల ద్వారా దేవలోకాలకు పంపిస్తారు. అనంతరం అమ్మవార్లను గ్రామోత్సవంగా తీసుకెళ్ళి జల్దిలో కలుపుతారు.
కన్యకా పరమేశ్వరి గుడిలో ఏర్పాటు చేసిన అమ్మవారిని, బ్రహ్మం గారి గుడిలో ఏర్పాటు చేసిన అమ్మవారిని వినాయకుని గుడి వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేయటంతో దసరా పండుగ ముగిసింది.
No comments:
Post a Comment