గ్రామంలో దాదాపు 50 సం. క్రితం వరకు దసరా పండగ నాడు బేతాళ గట్టు మీద మేకను బలి ఇచ్చి, పొంగలి పొంగించి, సుద్దులు చెప్పేవారు. ప్రస్తుతం అది జరుగుట లేదు. ఆనాటి విశేషాలు, దాని అంతరార్ధం తెలుసుకుందాం.
పూర్వపు రోజులలో బేతాళుడు అనే రాక్షసుడు గ్రామంలో ప్రజలను హింసిస్తూ ఇబ్బందులు పెట్టె వాడు. వాడి నుండి విముక్తి పొందాలని, వాడితో రాజీకి వెళ్లి, నీకు ఏమి కావాలో చెప్పమన్నారు. బేతాళుడు తనకు తాటి అంత పోతు, మేటి అంత ముద్ద కావాలని చెప్పాడు. సరే నీకు కావలసినవి చెల్లిస్తామన్నారు. బేతాళుడు తను అడిగినవి ప్రజలు చెల్లించ లేరనుకున్నాడు . ఎందుకంటే తన దృష్టిలో తాటి అంత పోతు అనగా తాటి చెట్టు అంత పోతు అని, మేటి అంత ముద్ద అనగా మేడ అంత అన్నపు ముద్ద అని.
అప్పటి ప్రజలు యుక్తిగా ఆలోచించి బేతాళుడు దగ్గరకు అతను అడిగినవి తీసుకెళ్ళారు. తాటి అంత మేక అంటే తాడు చివర కట్టిన మేక, మేటి అంత ముద్ద అనగా మేడి చివర పెట్టిన ముద్దను బేతాళునికి సమర్పించారు. బేతాళుడు చేసేది లేక వారు ఇచ్చినది తీసుకోని ఉరుకొన్నాడు. అప్పటినుండి ప్రతి దసరా పండుగ నాడు బేతాళ గట్టు మీద బేతాళునికి ఆ రెండు సమర్పించి వస్తారు.
పండుగ నాడు నిర్వహించే కార్యక్రమం: ఈ తంతు నిర్వహించటం కొన్ని కుటుంబాల వారు వారసత్వంగా చేసేవారు. ముందుగ గ్రామంలో ఆయుధాలు కలిగిన కుటుంబాల వారు తమ ఆయుధాలను శుద్ధి చేసుకోని బేతాళ గట్టు మీదకు తీసుకోని వెళ్ళేవారు. అందరు అక్కడకు చేరిన తర్వాత కొమ్ములోడు బేతాళుని కథ అనగా- కర్రి ఆవులు రాజు యుద్ధం -కథ చెబుతాడు. పొంగలి పొంగిస్తారు. వేటను బలి ఇస్తారు. వేట యాదవులకు, చాకలికి చెందుతుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరి ఆయుధాలు వారు తీసుకొని వెళతారు.
ఈ మొత్తం తంతును గ్రామంలో చిన్న, పెద్ద అందరు కలిసి తిలకిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహించటం దాదాపు 50 సంవత్సరాల క్రితం నిలిపి వేసారు. ఇది ఆనాడు చూసిన వారికి మిగిలి ఉన్న ఒక మధుర జ్ఞాపకం.
ఈ విషయాలు తెలియ జేసినది శ్రీ ఆలా శేషయ్య.
No comments:
Post a Comment