1990 లేదా 1991 సంవత్సరం శివరాత్రి రోజు కోటప్ప కొండ వద్ద రాత్రి పూట విపరీతమైన వర్షం కురిసింది. తిరునాళ్ళకు వచ్చిన లక్షలాది మంది భక్తులు చెల్లా చెదురయ్యారు. కరెంటు లేదు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ నిలిచిపోయింది. కొండ కింద ప్రభల వద్ద ఉన్న జనాలు నిలువెల్లా తడిచి ముద్దయ్యారు. ఇక రాత్రి వేళ చాల మంది కాలి నడకన ఇంటిముఖం పట్టారు. సరదాగా పదిమంది స్నేహితులము ఆనాడు తిరునాళ్ళకు వెళ్ళాము. కొండ పైన గుడికి వెళ్ళటమే కాకుండా, ఇంకా పైకి బొచ్చు కోటయ్య గుడి వరకు వెళ్లి( మెట్లు ఉండవు), కొండ చివర అంచున కిందకు దిగాము. చీకటి పడి ప్రభల దగ్గర అప్పుడే విద్యుత్ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అలసి పోయి నెమ్మదిగా ఒక్కొక్క ప్రభను చూసుకుంటూ పొలాలలో నడుస్తున్న మాకు పెద్ద ఎత్తున వర్షం దిగ్బ్రాంతిని కలుగజేసింది.కుర్రతనం కావటం వల్లనేమో వర్షంలోనే చిలకలూరి పేట కు నడవటం మొదలు పెట్టాము. ( జనమంతా అలానే నడుస్తున్నారు). వర్షం దెబ్బకు తల దాచుకునేందుకు అందరం తలోదిక్కు అయ్యాము. మిత్రుడు నరసింహ నాకు తోడు. ఎడవల్లి వరకు అలా వర్షంలోనే నడిచాము. అక్కడ ఒక గొడ్ల చావిట్లో కాసేపు సేద తీరి ఒళ్ళు అరబెట్టుకుని, ఆ తడిచిన బట్టలతోనే, మరల నడక సాగించాము. ఎడవల్లి సప్టా మీదుగా నడుములోతు నీళ్ళు ప్రవహిస్తున్నాయి.నరసింహ,నేను చేతులు కలిపి సప్టా దాటటం ఇంకా మరచిపోలేదు. (నాకు అండ, కండ నరసింహ). పోతవరం దగ్గర వేకువజామున తిన్న పకోడిలా వేడి ఇంకా గుర్తుంది. అలా తెల్లవారి 4 లేదా 5 గంటల సమయంలో పేట చేరాము. ఆనాడు వర్షం పడటం మంచిదేనని, లేకుంటే ప్రభల దగ్గర గొడవలై, బాంబులు విసురుకునే వాళ్ళని జనం చెప్పుకున్నారు.( ఒక ప్రభని చూస్తే అది ఏ పార్టీ వారి ప్రభో ఇట్టే అర్ధమై పోతుంది.).అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. ఇది మా పాదయాత్రకు 20 ఏళ్ళ నాటి నేపద్యం.
వయసు పెరిగింది. బరువు పెరింది. పొట్ట అదుపు తప్పింది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవలసిన పరిస్థితి. నాదెండ్ల స్కూల్ కి వెళ్ళే నన్ను ప్రతి రోజు పేట శివారు దాటగానే కోటప్పకొండ పలకరిస్తుంది. మరల ఇప్పుడు కోటప్పకొండకు నడిస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ మనసులోకి రావటం మొదలైంది. కొంత మంది మిత్రులు పెదవి విరిచారు. కొంతమంది రిస్క్ అన్నారు. నరసింహ మాత్రం సరే అన్నాడు.కానీ వాడు ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయాడు. ఇంతలో మిత్రుడు కాశి ( కాశీ విశ్వనాధ్) నేను రెడీ అన్నాడు. 30-08-2011(శనివారం) సాయంత్రం కాశీ రేపు కొండకి నడిచి వెళ్దాం అన్నాడు. నేను తటపటాయించాను కానీ తను కృత నిశ్చయం తో ఉన్నాడు. రేపు పెందలకడనే లేచి ప్రయాణానికి సిద్దం కావాలి.
కొంచెం అసాధారణమైన పని. కొంచెం భిన్నమైన పని. ఆ తలంపు తో శరీరం లో కొద్దిగా పెరిగిన వేడి. ప్రయాణానికి ముందు ఉద్విగ్నంగా అనిపించింది. ఆ ప్రయత్నానికే ఇలా అనిపిస్తే మరి, వివిధ రంగాలలో దేశానికీ ప్రాతినిధ్యం వహించే వారి స్థితి, రికార్డుల కోసం తపన పడేవారి మానసిక స్థితి, ఆ మాటకొస్తే ఏ రంగంలోనైన సఫలీకృతులవ్వాలనుకునే వారి మనో ధైర్యం తలపుకొచ్చాయి. ఆదివారం ఉదయాన్నే6.30 గంటలకు కోటప్ప కొండకు చిలకలూరి పేట నుండి నడక ప్రారంభించాము. సుమారు 16 కిలోమీటర్లు.
పురుషోత్తమపట్నం