ఒక రోజు రామలింగడి కొడుకు రాజుగారి సభకు వచ్చాడు.వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. రాజు వాడిని
చూశాడు.ముచ్చటగా ఉన్నాడు అనుకున్నాడు.
అయితే వాళ్ళ నాన్నకున్న తెలివి తేటలు ఉన్నాయా అనిపించింది. వాడిని దగ్గరికి పిలిచాడు. వాడు పరుగెత్తుకొని
వచ్చాడు.రాజుకి దండం పెట్టాడు.
రాజు సంతోషించాడు. పదిరూపాయలు ఇవ్వబోయాడు. కానీ కుర్రాడి తీసుకోలేదు.
" ఏం ఎందుకు తీసుకోవు ?"అనడిగాడు రాజు."తీసుకో తప్పులేదు" అన్నాడు మళ్ళీ.
"వద్దు మా అమ్మ కోప్పడుతుంది" అన్నాడు ఆ కుర్రాడు.
"ఎందుకు" అనడిగాడు రాజు.
"ముక్కూ మొగం ఎరగనోళ్ల దగ్గర డబ్బు తీసుకోకూడదట. మా అమ్మ చెప్పింది "అన్నాడు వాడు.
"సెబాస్. ఆవిడ మంచి మాటే చెప్పింది కానీ నేను ముక్కూ మొగం ఎరుగని వాడిని కాదు, రాజుని గదా! తీసుకో
"అన్నాడు రాజు.
"అవును. తెలుసనుకోండి" అని నీళ్ళు నమిలాడు ఆ కుర్రాడు.
"మరింకా అనుమానమెందుకు?"రాజు నచ్చచెప్పాడు.
"మా అమ్మ నమ్మదు మరి" అన్నాడు వాడు.
"ఏం ఎందుకు నమ్మదు?" అడిగాడు రాజు.
"ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజు గారే అయితే ఆయన పది రూపాయలిస్తారా?బోలెడు ఇస్తారుగానీ
అంటుంది మా అమ్మ" అన్నాడు రామలింగడి కొడుకు.
దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది.కానీ ఆ జవాబుకి ఆయన తల తిరిగిపోయింది.
వాడికి మంచి కానుకలిచ్చి పంపించాడు.
కర్టెసీ: జన విజ్ఞాన వేదిక ( రామలింగడి ఏడు కథలు)
No comments:
Post a Comment