చెలం కొండలలో ఎంతో విశిష్టమైన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. పురాతన కాలం నుండే స్వామివారు పూజలు అందుకుంటున్నారు. గుడికి ఎదురుగా కాలభైరవుడు ప్రతిష్టించబడి ఉన్నారు. గుడి దగ్గరలోని పుట్ట పురాతన కాలం నుండే భక్తుల పూజలందుకుంటుంది.
దాదాపు 300 సం. క్రితం జరిగిన శ్రీ మూలా స్థానేశ్వర స్వామి వారి మహిమకు సజీవ సాక్ష్యమైన సీతమ్మ తోపు, చెరువు చెలం కొండలకు ఆనుకొని తూర్పు వైపున ఉంది. ఆ చెరువు వొడ్డున ఒక పెద్ద మర్రి వృక్షం, దాని కింద ఒక పుట్ట ఉంది. మర్రి చెట్టు 11 కొమ్మలుగా చీలి ఉంది. 11 పడగల నాగేంద్రుడు ఈ చెట్టు మీద ఉండి భక్తులను రక్షిస్తుంటాడని నమ్మకం. దీనికి గ్రామంలో అనేక నిదర్శనాలున్నాయి.
గ్రామం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ పండా వెంకటప్పయ్య గారి మాటలలో చెప్పాలంటే చెలం కొండలలో అనేక వందల దేవతా విగ్రహాలున్నాయి.వాటిలో చిన్నవాటిని కొందరు తీసుకెళ్లగా, కొన్ని శిధిలమైన విగ్రహాలు అక్కడే ఉన్నాయి. ఇక్కడి విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. వీటికి ఉదాహరణ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిష్టించిన భద్రకాళి అమ్మవారు, చెలం కొండలలో ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ప్రతిష్టించిన కాలభైరవుని విగ్రహం.
చెలం కొండల నుండి నాదెండ్ల గ్రామంలోని ముచికింద పర్వతం(మచ్చుగట్టు ) నాకు ఒక సొరంగ మార్గం ఉందని చెబుతారు. ఈ కొండలలో సొరంగ మార్గం నేటికి కొంతవరకు కనిపిస్తుంటుంది. పురాతన కాలంలో దిగంబరులైన మునులు ఈ రెండు కొండల మధ్య తిరుగుతూ ఉండేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాక చెలం కొండల నుండి కొండవీటి కోటకు సొరంగ మార్గం ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తల అంచనా.
ప్రస్తుత కాలానికి వస్తే తొలి ఏకాదశి పర్వదినం నాడు రామబుగ్గలో స్నానం చేయుటకు గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని, మొండి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. కొండపై నుండి రామ బుగ్గలోనికి చేరుతున్న వర్షపు నీటికి, అనేక రకాల ఆకులు, మట్టితో కలియుట వలన, ఔషద గుణాలు చేరి ఉండవచ్చు. రామబుగ్గా లో స్నానం చేసి కొండలలో ఉన్న అనేక దేవత విగ్రహాలను, పుట్టలను పూజించి మొక్కులు చెల్లిస్తారు. తోలి ఏకాదశి తర్వాత రోజు చెలం కొండల పై ఉన్న అట స్థలము లో చిన్న పెద్ద చేరి సరదాగా ఆటలు అడతారు.
నాదెండ్ల గ్రామ చరిత్రకు, సంస్కృతికి ఆలవాలమైనది ఈ చెలం కొండలేనని నిస్సందేహంగా చెప్పవచ్చును.
No comments:
Post a Comment