Tuesday, November 13, 2012

ఓదార్పు (బాలల దినోత్సవం సందర్భంగా)

కళ్యాణ్ స్కూల్ నుండి బిక్క మొహం వేసుకొని వచ్చాడు.
"కళ్యాణ్ ఏమైందమ్మా? ఎందుకలా  ఉన్నావ్?"
.......
"చెప్పు నానా ! ఏమైంది?"
"ఎస్సే  రైటింగ్ పోయింది డాడీ.."  గొంతు పెగలటం లేదు. మంచం మీద  వాలిపోయాడు .
"ఓహో! నిన్న నెట్ లో సెర్చ్ చేసావు...నెహ్రు గారి గురించీ...నోట్  బుక్ లో రాసుకున్నావు... అందుకేనా ?"
...... తలూపాడు . కళ్ళు ఎరుపెక్కాయి.. .. కళ్ళు నులుముకుంటున్నాడు.
"వద్దమ్మా .. కళ్యాణ్! పొతే పోయిందిలే,దానికి ఎందుకంతగా బాధపడతావ్?"
"ఫస్ట్  ఎవరొచ్చారు?"
కన్నీరు కట్టలు తెంచుకుంది...ఎక్కిళ్ల మధ్య ... " సలీం ఫస్ట్ , ఆకాష్ సెకండ్ వచ్చారు డాడీ ."
వాళ్ళిద్దరూ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చాయి. వీడికి బహుమతి రాలేదు.
"స్పోర్టివ్ గా  తీసుకో, పార్టిసిపేషన్  ఇంపార్టెంట్ .. గెలుపోటములు కాదమ్మా!"
....ఎక్కిళ్ళు....
"సలీం ఎక్కువగా రాయలేదు డాడీ! తనకొచ్చింది రాసేసాడు. కాకపోతే రైటింగ్ బాగుంది."
....ఎక్కిళ్ళు అడ్డమొస్తున్నాయి ...
"నేను చాల రాశాను. నా రైటింగ్ బాగాలేదు. లైన్స్ వంకర పోయాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయని సార్  చెప్పారు."
"పర్వాలేదు. నీ  వయసులో ఈ మాత్రం పాల్గొని సొంతంగా రాశావు . మా అప్పుడు మాకు ఏమీ  తెలియదు . నువ్వు చాల బెటర్ మా మీద."
....ఎక్కిళ్ళు...
"నీ  పొరపాటు అర్ధం అయింది కదా! రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకో, ఈ సారి ఇంకా బాగా చేద్దువుకాని..."
...ఎక్కిళ్ళు ఆగటంలా..
"అయ్యో! చాల సీరియస్ గా ప్రిపేర్ అయినట్లున్నావు. దిగులు పడకు నానా ! రిలాక్స్ అవు ! .." అంటూ దగ్గరకు తీసుకోని ముద్దుపెట్టుకున్నా.
 ....ఉహు ... ఎక్కిళ్ళు  పెడుతూనే ఉన్నాడు తలుచుకొని.
"బాలల దినోత్సవం కోసం మీరంతా ఉత్సాహంగా ఉండాలని పోటీలు పెడుతుంటే హుషారుగా ఉండాలి గానీ, ఇలా బాధ పడకూడదు నానా !"
.....
....
" మరీ ! సలీం నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా!"
"అవును"
"నిన్నేమీ  బ్లేం చేయలేదు ఇంతవరకు. బాగా ఉంటాడు నీతో.మన ఇంటికి వస్తుంటాడు.నువ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తావు. మీరు కలిసి ఆడుకుంటారు. కలిసి భోజనం కూడా చేస్తారు కదా?"
"ఔను డాడీ!"
"మరీ! ఒక వేళ నీకు బహుమతి వచ్చి, తనకు రాకపోతే, తను ఇలాగే  ఏడుస్తాడు కదా!"
"అవును" కళ్ళు నులుముకుంటూ అన్నాడు.
"మరి నీ ఫ్రెండ్ అలా  ఏడుస్తుంటే నీకు ఇష్టమేనా...?"
కాదంటూ తల అడ్డంగా ఉపాడు .
"అందుకే ఇలాంటి బాధ నీ  ఫ్రెండ్ కి వద్దు. ఈ పోటిలో గెలిచిన అతనికి సంతోషమే నువ్విచ్చే బహుమతి..!  సరేనా!?"
...స్థిమిత పడ్డాడు ... సరేనన్నాడు...
కాసేపు టీ .వీ . చూస్తానంటూ లేచి వెళ్ళాడు నెమ్మదిగా...
వాడినే చూస్తున్నా... చెమ్మగిల్లిన కళ్ళతో .. వాడిని ఓదార్చగలిగానన్న తృప్తి.


1 comment: