Friday, April 1, 2011
శివాలయం- ఆలయ మహిమ- అఖండాలు, చిచ్చుల తోరణం
శివాలయానికి సంబంధించిన అతి ముఖ్యమైన మహిమ, చారిత్రాత్మక సత్యం గురించి వివరంగా తెలుసుకుందాం. దాదాపు 300 సం. క్రితం ( 6 తరాల క్రితం) జరిగిన మహిమ. శ్రీమతి నల్లమోతు సీతమ్మ గారి ద్వారా లోకానికి చాటబడిన శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి మహిమ ఇది.
నల్లమోతు సీతమ్మ గారి భర్త తన పాలేర్లతో కలిసి గుర్రం మీద పొలం వెళుతున్నారు ( ఆయన పేరు చినరామయ్య అని కొందరు పెద్దలు చెప్పారు). ఆయనకు ముందుగా ఎద్దుల అరకలు వెళుతున్నాయి. గొల్లపాలెం చెరువు దగ్గరగా ఉన్న పొలాల గుండా వెళుతుండగా ఒక పెద్ద తాచు పాము అడ్డువచ్చి బుసకొడుతూ ఎదురు నిలబడింది. ముందు వెళుతున్న ఎద్దులు, పాలేర్లు భయంతో ఆగిపోయారు. గుర్రం మీద ఉన్న చిన్న రామయ్య గారు పాముని చంపమని పాలేర్లతో చెప్పగా ఎవరు ధైర్యం చేయలేకపోయారు. అప్పుడు గుర్రం దిగిన చిన్న రామయ్య గొడ్డలితో పాముపై ఒక వేటు వేసారు. సగం తెగిన పాము దగ్గరలో ఉన్న రంధ్రం లోకి వెళ్ళిపోయింది. లోనికి వెళ్ళిన పాము బయటకు వస్తుందని ఎదురు చూసి, అది బయటకు రాక పోవడంతో ఆ రంధ్రమునకు రాళ్లు కొట్టించి పూడ్చి వేసారు. ఈ విషయం తెలుసుకున్న సీతమ్మ భయంతో వణికి పోయి, ఏనాటికైనా భర్తకు ఆపద తప్పదని ఉహించినది.
కొన్నిరోజుల తర్వాత చిన్న రామయ్య ఆ దారిన వస్తూ ఇదివరకు పూడ్చిన రంద్రంలోని రాళ్ళను తొలిగించమని పాలేర్లతో చెప్పగా భయంతో ఆ పని వారు చేయలేదు.మొండి ధైర్యంతో రామయ్య రంధ్రానికి ఉన్న రాయిని తొలగించే ప్రయత్నం చేసాడు. ఆ రాయి చాటునే ఉన్న పాము బయటకు వచ్చి ఆయనను కాటు వేసినది. హతసుడైన రామయ్య పాలేరు సహాయంతో ఇంటికి బయలు దేరాడు.ఆ రోజులలో పాము కాటుకి గురైనవారి ఒళ్ళంతా విషం పాకకుండా తల మీద బరువుని పెట్టుకొని, వైద్యుని వద్దకు లేదా మంత్రగాని వద్దకు తీసుకు వెళతారు.ఆ విధంగా నెత్తిన బరువైన బండరాయిని పెట్టుకొని గుర్రం మీద కూర్చొని ఇంటికి బయలుదేరాడు. ఊరిలోకి వచ్చేటప్పటికి నెత్తి మీద బండను నిలుపుకోలేక కిందకు పడవేసాడు. అపుడు విషం ఒళ్లంతా పాకి క్రింద పడి అపస్మారక స్థితి లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోవటం ఖాయమని అందరు భావించారు.
విషయం తెలుసుకున సితమ్మగారు ఆయనను శివాలయంలోకి చేర్పించినది. గర్భగుడిలోకి ఆయనను తీసుకువెళ్ళి పెట్టినది. చిన రామయ్య బ్రతికి తేనే తను బయటకు వెళతానని లేకపోతె తను ఇక్కడనుండి కదలనని తలుపులు వేయించినది. ఆయన బ్రతికితే కార్తిక పౌర్ణమి నాడు అఖండమును వెలిగించి, చిచ్చుల తోరనమును కాలుస్తామని స్వామి వారికి మొక్కినది. తెల్లవారే సరికి ఆయనలో స్పృహ వచ్చి మనిషి పక్కకు తిరిగాడు. తర్వాత ఆయన పూర్తిగా ఆరోగ్యం పొందాడు. ఆనాటి నుండి సీతమ్మ గారు కార్తిక పౌర్ణమి నాడు అఖండము వెలిగించి, చిచ్చుల తోరణము కాల్పించుట జరుగుతూ వస్తున్నది. దీని కొరకు సీతమ్మ గారు 11 ఎకరాల తోపును చలం కొండల తూర్పువైపున ఏర్పాటు చేసినది. ఇప్పటికీ ఇది సీతమ్మ తోపుగా పిలవబడుతుంది. ఇక్కడ ప్రస్తుతం చిన్న చెరువు(కుంట) ఉన్నది. దీని ఒడ్డున పెద్ద మర్రి చెట్టు, చెట్టు కింద నాగవయ్య పుట్ట ఉన్నది.
ఆనాటి నుండి ఆ వంశస్తులు, గ్రామంలోని భక్తులే కాక ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా కార్తిక పౌర్ణమి నాడు అఖండదీపమును వెలిగించి, అనంతరం తోరణమును దర్శించి స్వామి వారి కృపకు పాత్రులగుచున్నారు.
వివరణ: అఖండము అనగా పెద్ద మట్టి మూకిడి కొత్తది తీసుకుంటారు. దానిలో తాముమొక్కుకున్న మేర నువ్వుల నూనె పోసి రూపాయి నాణెమును వేస్తారు. కొత్త గుడ్డతో వత్తిని చేసి మూకిడిలో ఉంచుతారు. ప్రమిదను వెలిగించి దానితో అఖండమును వెలిగిస్తారు. ఈ అఖండమును రెండు చేతులతో పట్టుకొని ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేసి, తదుపరి ఆలయ గోపురంపై, మండపంపై, గోడలపై ఉంచుతారు . ఆ ప్రమిదలను దూరం నుండి చూసినప్పుడు ఆకాశంలో ని నక్షత్రాల గుంపు కిందకి వచ్చినట్లు మిణుకు మిణుకు మంటూ బహు సుందరంగా కనిపిస్తుంది.
చిచ్చుల తోరణాన్నే జ్వాల తోరణం అని కూడా అంటారు.కార్తిక పౌర్ణమి నాటికి అప్పుడే వచ్చిన వరి గడ్డిని తీసుకువస్తారు . కొత్తగా తీసిన గోగునారను తాడులా పేని వరిగడ్డిని విచ్చెలు విచ్చెలు గ వేలాడ దీస్తారు. ఈ జ్వాలా తోరణాన్ని శివాలయమునకు ఎదురుగా ఉన్న రెండు వేప చెట్లకు వేలాడ దీస్తారు. అఖండములు పూర్తి అయిన పిమ్మట జ్వాలా తోరణం వెలిగిస్తారు. గడ్డి అంతా కాలడం మొదలు పెట్టిన తర్వాత గ్రామంలోని రైతు లందరూ ఆ గడ్డి పోచలు, నారా పీచులు దక్కించుకోవటానికి పోటి పడతారు(యువకులు పోటీ పడటం రగ్బీ ఆటను తలపిస్తుంది!). వీటిని పశువుల మేతలో కలిపి పెట్టుట, పశువుల మెడలో కట్టుట చేస్తారు. ఈ విధంగా చేయుట వలన పశువులకు ఎలాంటి హానీ జరగదని నమ్మకం. అఖండములు వెలిగించుట , చిచ్చుల తోరణం మండించుట... చూడవలసినదే కానీ వర్ణించుట తరము కాదు. భక్తి పారవశ్యంతో స్వామి వారికి అఖండములు సమర్పించే సమయంలో గ్రామం మొత్తం శివాలయం వద్దే ఉంటుందనుట అతిశయోక్తి కాదు.
ప్రతి కార్తిక పౌర్ణమి నాడు స్వామి వారికి అఖండాలు చెల్లించుటకు, నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు గ్రామానికి వచ్చి, శివాలయంలో అభిషేకం జరిపించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అఖండములు స్వామి వారికి చెల్లించే సమయంలో హరోం హర, ఓం నమః శివాయ స్తోత్రాలు మిన్నంటుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment