Showing posts with label నాదెండ్ల చరిత్ర. Show all posts
Showing posts with label నాదెండ్ల చరిత్ర. Show all posts

Wednesday, September 1, 2010

అన్నాప్రగడ కామేశ్వర రావు - ౩వ భాగం

లాలా లజపతి రాయ్ ను లాఠీలతో కొట్టి అయన మృతికి కారణమైన సాండర్స్ ను చంపటానికి హిందూస్తాన్ రిపబ్లిక్ అర్మి నిర్ణయం తీసుకున్నది. నిర్ణయాన్ని అమలు పరచటానికి ఆజాద్ తో కలసి వ్యూహ రచన చేసారు. రాయ్ చనిపోయిన నెల రోజుల లోపే సాండర్స్ ను హత్య చేసారు. ఈ సాహస కార్యంలో పాల్గొన్న వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్, జయగోపాల్, ఆజాద్ మరి కొందరు సభ్యులు.

పోలిసుల నుండి తప్పించు కొనుటకు బరోడా లోని ఆర్య కుమార ఆశ్రమంలో అన్నాప్రగడ తల దాచుకోన్నారు. అక్కడ ఆశ్రమంలో ఉన్న గుజరాత్ కి చెందిన రాజ పుత్ర స్త్రీ, కవయిత్రి అయిన సరళా దేవి ఆయనను ప్రేమించినది. సావర్కర్ సోదరుల అనుమతితో వారు వివాహం చేసుకొన్నారు.

1929 ఏప్రిల్ 8 వ తేదిన ఢిల్లీ లోని సెంట్రల్ అసెంబ్లీ హాల్ లో పొగ బాంబులు విసిరి రివాల్వర్ తో గాలి లోకి కాల్పులు జరిపి భగత్ సింగ్, భటకేశ్వర్ దత్ లు స్వచ్చందంగా అరెస్ట్ అయారు. వారిని లాహోర్ జైలులో ఉంచారు.తరువాత జతిన్ దాస్, సుఖ్ దేవ్ లను కూడా అరెస్ట్ చేసి లాహోర్ జైల్లోనే ఉంచారు. జతిన్ దాస్ జైల్లో నిరాహార దీక్ష చేస్తూ చనిపోయాడు. మిగిలిన ముగ్గురిని జైలు నుండి తప్పిస్తామని అన్నాప్రగడ, విజయకుమార్ సిన్హా భగత్ సింగ్ కు కబురు చేయగా అయన అందుకు అంగీకరించలేదు. పోలిసుల వత్తిడి ఎక్కువ కాగా అహ్మదాబాద్ కు మకాం మార్చాడు. అహ్మదాబాద్ లో టెక్స్ టైల్ కార్మికులను ఒక సంఘటిత శక్తి గా మార్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసారు. తర్వాత బరోడా వచ్చారు.

బరోడాలో బ్రిటిష్ ఇండియా పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా బరోడా మహారాజు శామోజి రావు గైక్వాడ్ సహకారంతో తప్పించుకొని ముంబై చేరి అక్కడనుండి గుంటూరు వచ్చారు. గుంటూరు కాంగ్రెస్ నాయకులు 'దేశ భక్త' కొండా వెంకటప్పయ్య పంతులు , ఉన్నవ లక్ష్మీనారాయణ గార్లు విప్లవ కారులకు , హింసా వాదులకు ఇక్కడ ఆశ్రయం లేదనగా అక్కడే ఉన్న పల్నాడు రెంటచింతల కు చెందిన మరో కాంగ్రెస్ వాది అయిన నాళం మట్టపల్లి గారు తన ఊరికి వారిని రహస్యంగా తీసుకువెళ్ళి ఎత్తిపోతల జలపాతం దగ్గర ఉన్న పొలాలలో అజ్ఞాత వాసమునకు ఏర్పాటు చేశారు. అన్నాప్రగడ అజ్ఞాతం గురించి తెలిసిన ప్రభుత్వం అక్కడ DSP సంజీవి గారి ఆధ్వర్యం లో పోలీసు పటాలాన్ని పంపారు. విప్లవోద్యమం పట్ల సానుభూతి ఉన్న DSP సంజీవి అక్కడ ఉన్నది అన్నప్రడగా కామేశ్వరరావు కాదని, ఖద్దరు ప్రచారం కోసం ఊళ్ళు తిరిగే కాకిలాల కామేశ్వరరావు అని ప్రభుత్వం వారికి నివేదిక పంపారు. DSP సంజీవి సలహాపై అజ్నాట్ వాసం చాలించి, జనం లోకి వచ్చి స్వతంత్ర కోసం పోరాటం కొనసాగించాలనుకున్నారు.