Sunday, August 22, 2010

అన్నాప్రగడ కామేశ్వరరావు - 2 వ భాగం

సైన్యం నుండి తొలగించ బడిన తరువాత కామేశ్వరరావు గారు స్వగ్రామమైన నాదెండ్ల వచ్చారు . చుట్టు పక్కల గ్రామాలలోని దేశభక్తులను పోగుచేసుకొని పల్నాడు పుల్లరి ఉద్యమానికి మద్దతుగా పల్నాడు ప్రాంతంలో పర్యటించారు . ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని ప్రజలను రెచ్చగొడుతున్నారనే అభియోగంపై నరసరావుపేట సబ్ కలెక్టర్ జంబునాథ్ అయ్యర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన కారాగార శిక్ష విధించి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర విప్లవ యోధులతో కలసి అయన మరింత రాటుదేలాడు. అనంతరం ఆయనను రాజమండ్రి నుండి కడలూరు జైలుకు మార్చారు.శిక్ష పూర్తి కాగానే అయన జైలు నుండి విడుదలై స్వగ్రామం చేరుకున్నారు.

కామేశ్వరరావు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో తండ్రి రోశయ్య కారణం ఉద్యోగానికి రాజీనామా చేసారు. కుటుంబం ఆర్ధిక పరిస్థితి దీనంగా మారింది. కనపర్తి లో ఉన్న మేనమామ నిత్యానందం గారి వద్ద డబ్బులు తీసుకోని గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలకు వెళ్లారు. 1924 లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల నిర్వహణకు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వమని నిర్వాహకుల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లారు. శిక్షణ పూర్తి చేసి సభలు జరిగే సమయాన తల్లి కాన్సర్ వ్యాధితో చనిపోతే, జాతీయ నాయకుల ఆదేశం మేరకు మధ్యలోనే ఇంటికి వచ్చారు. ప్రతి సంవత్సరం జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావటం, అక్కడకు వచ్చే భావసారుప్యత గల విప్లవ నాయకులతో చర్చలు జరపటం చేసేవారు.

రష్యా వెళ్ళి రెడ్ ఆర్మీలో శిక్షణ పొందాలనే కోరికతో మిత్రుల సయం కోసం బొంబాయి వెళ్ళాడు. అక్కడ ఉన్న సదాశివన్(ఎం.ఎస్.సుబ్బ లక్ష్మి భర్త ), సావర్కర్ సోదరుల సహకారంతో రష్యా బయలుదేరాడు. దారిలో క్వెట్టాలో పోలీసులచే పట్టుబడి మరల బొంబాయి వచ్చారు. సావర్కర్ సోదరుల సలహాతో బరోడాలో వ్యాయామశాలలో ఎనిమిది నెలల శిక్షణ తీసుకున్నారు. బరోడా కేంద్రంగా విప్లవ కారులకు రహస్యంగా సాయుధ శిక్షణ ఇవ్వసాగారు.

భగత్ సింగ్ , చంద్ర శేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్ గురు ఆహ్వానం మేరకు కాన్పూర్ వెళ్లారు. అప్పటికే ఆజాద్ సారధ్యంలో భగత్ సింగ్ నేతృత్వంలో విప్లవ చర్యలు చేపడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీకి ఝాన్సీ లక్ష్మిబాయి అనుచరుడైన నానాసాహెబ్ జన్మస్థలమైన "బిత్తూర్" అడవుల్లో సైనిక శిక్షణ ఇచ్చి వారిని మరింత రాటు దేల్చారు.

శబీన్ బోస్, మరికొంత మంది సత్యగ్రహులతో కలసి బారిసాలలో సత్యాగ్రహం చేశారు. అక్కడ 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత లుధియానా వెళ్లి మదన్ మోహన్ మాలవ్యా , లాలాలజపతి రాయ్ లను కలిసారు. 1928 ఫిబ్రవరి 3 తేదిన సైమన్ కమీషన్ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన జరుపుతున్న లాలా లజపతి రాయ్ ను పోలీసులు లాఠీలతో కొట్టి ఛాతి మీద బాదారు. తీవ్రంగా గాయపడిన అయన కోమాలోకి వెళ్లారు. నవంబర్ 19 అయన మరణించారు. (సశేషం...)

No comments:

Post a Comment