Friday, October 22, 2010

పార్వేట ఉత్సవం

విజయదశమి నాడు జరిగే పార్వేట ఉత్సవ విశేషాలు, దాని అంతరార్ధం తెలుసుకొందాం. విజయదశమి నాటి సాయంత్రం ఘడియలన్నీ దోషము లేనివని, సమయంలో చేపట్టిన పని విజయవంతమవుతుందని నమ్మకం. అందుకే పురాతన కాలంలో రాజులు విజయదశమి నాడు శత్రురాజ్యాలపై యుద్ధానికి బయలు దేరుతారు.

మహాభారతంలో పాండవుల అరణ్య, అజ్ఞాత వాసాలు విజయదశమి ముందు రోజున పూర్తి అవుతాయి. అజ్ఞాత వాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలను విరాట నగరంలోని స్మశానంలో ఉన్న శమీ (జమ్మి) వృక్షం పై మూట గట్టి భద్రపరుస్తారు. విజయదశమి నాడు ఆయుధాలను జమ్మి వృక్షం పై నుండి కిందికి దింపించి, ఆయుధ పూజ చేసి, ఉత్తర గోగ్రహణం చేపట్టిన కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు.

పై విషయాలను గుర్తు చేసుకుంటూ గ్రామంలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం, గోవర్ధన స్వామి ఆలయంలో పార్వేట ఉత్సవం నిర్వహించుట పురాతన కాలం నుండి ఆచారంగా వస్తున్నది. స్వామి వారిని గ్రామ వీధుల గుండా ఉరేగింపుగా తీసుకోని వెళ్తారు. గోవర్ధన స్వామి వారి పార్వేట ఉత్సవం నారాయణ స్వామి మఠం వద్ద, మూల స్థానేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం బ్రహ్మం గారి గుడి వద్ద నిర్వహిస్తారు. కానీ ఏడాది వర్షం పడుతున్నందున స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వర్షంలో తడవరాదు కనుక ఆయా ఆలయాలలోని మండపాలలోనే పార్వేట ఉత్సవం నిర్వహించారు.

పార్వేట జరిపే విధానం: జమ్మి చెట్టు అందుబాటులో ఉంటే స్వామి వారిని అచటకు తీసుకు వెళ్తారు. లేదా జమ్మి కొమ్మలను తెచ్చి స్వామి వారి ఎదుట నాటించి, కొమ్మలలోకి సకల దేవతలను ఆవాహనం చేసి, వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఒక గొర్రె పిల్లను స్వామి వారి చుట్టూ తిప్పి బయటకు వదులుతారు. హిందూ మతం లో కొందరు బలి ఆచారం పాటిస్తారు. జనమేజయుడు వైదిక మతంలో బలి నిషేధించారు, కనుక బలి ఆచారం తంతు పూర్తి చేసామని చెప్పుటకు గొర్రె పిల్లను స్వామి వారి చుట్టూ తిప్పి బయటకు తెచ్చి వదులుతారు. అనంతరం స్వామి వారి పేరుతో అష్ట దిక్కులలో బాణాలు వదులుతారు. ఇలా చేయుట వలన అన్ని దిక్కులలోని యక్షిణి, రాక్షస మూకలు పారిపోతాయని శాస్త్రం చెబుతుంది. జమ్మి ఆకులను ప్రసాదంగా స్వామి వారి విజయ శాసనంలో ఉంచి భక్తులకు అందచేస్తారు. దానిని బంగారంగా భావించి పెద్దలకు అందజేసి వారి ఆశీర్వచనం తీసుకోవాలి.

ఆలయమునకు పురాతన కాలంలో మాన్యములు ఇచ్చిన వారి పేరుతో మంత్ర పుష్పం నిర్వహించి, గ్రామ రక్షణ, గ్రామ శ్రేయోభివృద్ధి కై ఆలయంలో పూజలు జరపడంతో పార్వేట ఉత్సవం ముగిసింది.

పార్వేట విశేషాలు శ్రీ సీతారామ స్వామి దేవాలయం (వెంకటేశ్వర స్వామి గుడి) ధర్మకర్త, ఆగమ పండితులు శ్రీ పండా వెంకటప్పయ్య గారు తెలియజేసారు.

No comments:

Post a Comment