Saturday, October 2, 2010

అన్నాప్రగడ కామేశ్వర రావు - నాలుగవ భాగం

అన్నాప్రగడ దంపతులు గుంటూరు చేరి మేనమామ దేచిరాజు సాంబశివరావు ఆశ్రయం పొందారు. స్థానికంగా ఉన్న యువకులలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపుతూ సాముగరిడీ శిక్షణ ఇచ్చారు. ఉన్నవ లక్ష్మీనారాయణ కోరిక మేరకు గుంటూరు లో డాక్టర్ మున్షి అన్నా , సావర్కర్ మొదలైన వారితో భారీ భహిరంగ సభ నిర్వహించారు. తర్వాత గుంటూరు లో మరో నిరసన ప్రదర్శన జరిపారు. మహిళలపై లాఠీ చార్జీ కై ఆదేశించిన పోలీసు కమీషనర్ మీనన్ పై చేయి చేసుకున్నారు. నేరం పై అన్నాప్రగడ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు.జైలు నుండి విడుదలై బొంబాయి వెళ్ళిపోయారు.

కరాచి కాంగ్రెస్ సభకు హాజరైన అన్నాప్రగడ తన స్నేహితుడైన పంజాబ్ విప్లవకారుడు పృధ్వీ సింగ్ తో కలిసాడు. వారిద్దరూ కరాచిలో ఉన్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ( సరిహద్దు గాంధీ) గారిని కలిసారు. ఖాన్ గారు పృధ్వీ సింగ్ ను ఇండియా సరిహద్దులు దాటించి రష్యా పంపించారు. తర్వాత ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తి గారి కోరిక మేరకు అయన వద్ద ఉన్న యువకులకు సైనిక శిక్షణ ఇచ్చారు.

కాలంలో ప్రతి విప్లవ కారుని కోరిక మేరకు రష్యా వెళ్లి అక్కడ రెడ్ ఆర్మీలో శిక్షణ పొందాలనే కోరిక ఉండేది. భారతదేశం నుండి రష్యా వెళ్ళడం చాల కష్టంగా ఉండేది. గతంలో ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమైన అన్నాప్రగడ వేరే దేశం నుండి వెళదామని ప్రయత్నించి ఆఫ్రికా వెళ్ళాడు.అక్కడ ఉన్న తన తోడల్లుడు అంబాల పటేల్ దగర ఆశ్రయం పొంది, ఒక భారతీయ పాఠశాల లో అధ్యాపకునిగా చేరాడు. అక్కడ ఉన్న భారతీయ విప్లవ కారుల సహకారంతో రష్యా వెళ్ళాడు.

రష్యాలోని 'పుష్కిన్ స్క్వేర్' లోని కుతుబ్ యునివర్సిటీ లో చేరాడు. అక్కడ కమ్యూనిజం, గతితార్కిక భౌతిక వాదం, బాంబులు తయారు చేయటం, ఆధునిక ఆయుధాల వినియోగం మొదలైన అంశాలపై కఠిన శిక్షణ తీసుకున్నారు. రష్యాలో ఉన్నపుడు "సోవియట్ రష్యా నూతన రాజ్యాంగం " స్వేచ్చానువాదం తో తెలుగులోకి అనువదించారు. శిక్షణలో అన్నాప్రగడ ప్రతిభను గమనించిన రెడ్ ఆర్మీ జనరల్ కామ్రేడ్ వర్షిలోవ్ ఈయనతో బాగా స్నేహం చేసారు.వర్షిలోవ్ అన్నప్రగడను స్టాలిన్ కు, కాగ్నవిచ్ కు పరిచయం చేస్తూ " బ్రిటిష్ ఇండియా సైన్యంలో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించి మరణ దండనకు గురైన కామేష్ ఇతనే అని చెప్పాడు. స్టాలిన్ అబ్బురపడి తన కార్యక్రమం " మెట్రో భూగర్భ కలువ ప్రారంభోత్సవం " పూర్తయ్యే వరకు తన పక్కనే ఉంచుకున్నారు. స్టాలిన్, కాగ్నవిచ్ ల మధ్య ఉన్న అన్నాప్రగడ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా పత్రికలలో ప్రచురితం అయింది. రష్యాలో శిక్షణ పూర్తి అయిన పిదప ఫ్రాన్స్ మీదుగా పాండిచ్చేరి చేరుకొని మద్రాసు వచ్చారు. తరువాత సత్తెన పల్లి చేరుకొని తన మిత్రుని ప్రెస్ లో తను ఇంతకూ ముందు రచించిన "అల్లూరి సీతా రామ రాజు చరిత్ర", " సోవియట్ రష్యా నూతన రాజ్యాంగం'" పుస్తకాలూ రహస్యంగా అచ్చు వేయించి అందరికి పంచారు. ఈ పుస్తకాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించి తగలబెట్టించింది.

No comments:

Post a Comment