Monday, November 8, 2010

కార్తీక మాసం ప్రారంభం (07-11-10)

కార్తీక మాసము ఆదివారముతో ప్రారంభమైనది. ప్రతి రోజు వేకువ జామునే స్నానాలు చేసి, దీపం వెలిగిస్తారు. తర్వాత దగ్గరలో ఉన్న శివాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. పగలంతా ఉపవాసము ఉంది, సాయంత్రం నక్షత్రాలను చూసి భోజనం చేస్తారు. కార్తీక మాసం స్నానాలు ప్రవహించే నీటిలో చేయాలని నియమం. అవకాశం లేని చోట బావి నీటిని ఉపయోగిస్తారు. కార్తీక మాసంలో గోపాదమంత ప్రదేశంలో ఉన్న నీటిలోనైన ముక్కోటి దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసంలో పవిత్ర స్నాన మాచరించి, ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయంలో దీపారాధన చేసినచో సర్వ పాపాలు నశిస్తాయని చెబుతారు.

ఆదివారం ఉదయంతోనే గ్రామంలో కార్తీక మాస పవిత్ర స్నానాల సందడి మొదలైంది. ప్రవహించే నిరు అందుబాటులో లేనందున భక్తులు పెద్ద సంఖ్యలో బావుల వద్ద పవిత్ర స్నానమాచరించారు. పూలతో సుందరంగా అలంకరించబడిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు జరిపారు. గ్రామంలో భక్తులందరికీ గోత్ర నామాలతో పెద్ద సంఖ్యలో అభిషేకాలు చేయటం మొదలైనది.

రోజు (08-11-10 )కార్తీక మాసం మొదటి సోమవారం కావటంతో శివాలయం భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప స్వాములు, భవాని మాల ధారకులు పెద్ద సంఖ్యలో స్వామి వారి సన్నిధికి వచ్చి ఆశిస్సులు అందుకున్నారు. రోజు ముగ్గురు భక్తులు దక్షిణా మూర్తి మాలను ధరించి, దీక్ష స్వీకరించారు. వీరు కోటప్పకొండకు వెళతారు.

కార్తీక మాసంలో కేవలం మన గ్రామంలో మాత్రమే జరిగే విశిష్టమైన కార్యక్రమం అఖండ దీపోత్సవం. కార్తీక పౌర్ణమి నాడు అనగా నవంబర్ 21 తేదిన సాయంత్రం జరుగును. నవంబర్ 25 అయ్యప్ప భక్తుల భజన, హోమగుండం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

No comments:

Post a Comment