Tuesday, November 23, 2010

దిగ్విజయంగా ప్రసారమైన కార్తిక పౌర్ణమి వేడుకల లైవ్ షో

నాదెండ్ల గ్రామంలో ఉన్న గంగ పార్వతి సమేత మూల స్థానేశ్వర స్వామి వారి దేవ స్థానంలో ప్రతి కార్తిక పౌర్ణమి నాడు జరిగే అఖండాల పండుగ ను ఘనంగా నిర్వహించారు. ఉదయం .౩౦ గంటల నుండే మహిళలు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని దీపారాధనలు నిర్వహించారు. 365 వత్తుల కట్టలతో దీపాలు వెలిగించారు. తదుపరి మన గ్రామంలో ఉన్న ఆచారం ప్రకారం గ్రామంలో ఉన్న వివిధ దేవాలయాలను దర్శించి దీపాలు వెలిగించారు.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు చూసి భోజనాలు పూర్తి చేసుకొని అఖండలు పెట్టుటకు గుడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. సాయంత్రం 7.59 ని. లకు వర్జ్యం వస్తుందని 7 గం.లకే అఖండాలు వెలిగించుట మొదలు పెట్టారు. తర్వాత ఒక ప్రదక్షిణ పూర్తి చేసి ఆలయం పైన అఖండాలను పెట్టారు. మొత్తం కార్యక్రమాన్ని గుడి చుట్టూ 4 వరసలు ఉన్న భక్తులు ఎంతో క్రమశిక్షణతో పూర్తి చేసారు. అనంతరం గుడికి ఎదురుగ ఉన్న మర్రి, వేప చెట్లకు ముందుగానే సిద్దం చేసినా చిచ్చుల తోరణాన్ని వెలిగించారు. దానిలో గడ్డి పీచులను, నారను దక్కించుకోవటానికి అందరు పోటి పడ్డారు. ఇలాంటి ఘట్టాన్ని చూడవలసినదే కానీ వర్ణించనలవి కాదు. అనంతరం స్వామి వారు గ్రామోత్సవానికి బయలు దేరటంతో కార్యక్రమం ముగిసినది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసరంగా ఇవ్వాలనే కోరికను చేకూరి అమరేంద్ర వద్ద వ్యక్తం చేసినపుడు దాని సాధ్యాసాధ్యాలను లోతుగా చర్చించాము. ఇంటర్నెట్ లో దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసాము. రోజు 4.50 ని . వరకు గూడా లైవ్ కార్యక్రమం కనెక్ట్ కాలేదు. అయినా మొండి ధైర్యం తో దేవుని మీద భారం వేసి సిస్టం, వెబ్ కాం లను గుడికి తీసుకు వచ్చి మొదలు పెట్టగానే లైవ్ దొరికింది. లైవ్ కవరేజ్ కొరకు ఎంతో కష్టపడి అసాధ్యమనుకున్న దానిని సాధ్యం చేసిన అమరేంద్ర అభినందనీయుడు. ధన్య వాదాలు అమరేంద్ర!. తన వ్యక్తిగత పనుల వలన కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన మా మెంబర్ ఎస్. శ్రీనివాసరావు ఫోన్ ద్వార తన సూచనలు, సలహాలు అందిస్తూ వచ్చారు. వల్లభనేని అమరేంద్ర సిస్టం ముందు కూర్చుని అందరికీ కనెక్ట్ చేస్తూ లైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపాడు. వీరే కాక అనేక మంది యువకులు లైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. వీరందరికీ కూడా ఆన్ లైన్ టీం తరుపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.
-- యం. కుమారస్వామి

మనవి: మన బ్లాగ్ కి స్పందన చాల బాగా ఉంటోంది. పదహారు దేశాలనుండి ఈరోజు వరకు ఐదువేలు పైబడి క్లిక్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు విషయాలను అప్ డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇచ్చే టాపిక్ లో వైవిధ్యం ఉండేలా చూస్తున్నాము. మీ స్పందన ఆశిస్తున్నాము. కామెంట్స్ రూపం లో మీరు తెలియజేస్తే మాకు ఫీడ్ బాక్ గా ఉండగలదు. ఉదాహరణకు 'జోలపాటలు' అనే టాపిక్ లో ముఖ్య మైనవి ఇచ్చాము. వాటి అవసరం మీకు ఉంటుందనే భావనలో ఉన్నాం. వాటిని చదివిన వారు, ఉపయోగించిన వారు మీ అభిప్రాయాలూ తెలియ జేయండి. ఇంకా బాలల గేయాలు,కథలు, వర్ణమాల, తెలుగు పదాలు, చిత్ర కథలు, మన తెలుగు నేటివిటీ ఉన్న కథలు, ప్రాథమిక స్థాయిలో ఒక పిల్లవాడు నేర్చుకోగలిగిన విషయాలు అన్నింటిని పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం. విషయాలపై మీరు అభిప్రాయాలూ తేలియా జేస్తే మరింత మెరుగుగా అందచేస్తాం.పైన తెలిపిన సాహిత్య ప్రక్రియల వలన మన బిడ్డ మనతో ఎంతో అనుబంధం పెంచుకుంటాడు. మన సంస్కృతి, మన మట్టి వాసనలు పోకుండా ఉంటాయి.ఇది అనుభవపూర్వకమైన విషయం.

మీ అమూల్య సలహాలు, అభిప్రాయాలూ, విమర్శలు మనస్పూర్తిగా కోరుకుంటూ మన నాదెండ్ల ఆన్ లైన్ టీం తరుపున - సదా మీ సేవలో మన్నె కుమారస్వామి.

No comments:

Post a Comment