Monday, March 14, 2011

శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణ మహోత్సవ విశేషాలు

నాదెండ్ల గ్రామ శంభుని పాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు 9 తేది నుండి 11 తేది వరకు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ఆగమ శాస్త్రోక్తంగా సాంప్రదాయ బద్ధంగా జరిగాయి. కార్యక్రమ వివరాలు, నిర్వహించే కార్యక్రమ నిగూఢార్థాలు ...
09-03-2011 సాయంత్రం 6.30 ని. లకు ప్రార్ధన :
->విష్వక్సేన పూజ, పుణ్యావచనం : శ్రీ మహా విష్ణువు వారి సర్వ సైన్యాధిపతి విష్వక్సేనుల వారు. వైష్ణవ అలయములలో మొదటగా విశ్వక్షేనుల వారికి పూజలు జరుపుతారు. పుణ్యావచనం అనగా కలశ పూజ చేసే ఆలయంలో నీళ్ళు చల్లుతారు.
->అఖంఢ దీపారాధన:
-> పంచగవ్య ఆరాధన: వేదాలలో గోమాతకు ప్రముఖ మైన స్థానం ఉంది. ఆవు పలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచకం, ఆవు పేడ 5 పాత్రలలో పెట్టి ఆవాహన చేసి తీర్థంగా ఇస్తారు.
-> మృత్సం గ్రహణం మరియు అంకురరోహణ ( పుట్ట మట్టి సేకరణ మరియు ధాన్యాలు మొలకెత్తించుట):
మొదటిగా పుట్ట మన్ను సేకరిస్తారు. పుట్ట మట్టిని తవ్వి తీసే ముందు భూమాతకు పూజ చేసి, తల్లి అనుమతితో మట్టిని సేకరిస్తారు. పుట్ట మట్టిని ఆలయంలోనికి తీసుకువచ్చి పూజా సంస్కారాలు నిర్వహించి 14 పాలికలలో అనగా 4 మూకిళ్ళు, 7 ముంతలలో పోస్తారు. అంతకు మునుపే నానబెట్టిన ధాన్యాలను ఆవు పాలలో శుద్ధి చేసి పాలికలలో పోస్తారు. విత్తనాలు మొలకెత్తిన దానిని బట్టి గ్రామ సుభిక్షతను నిర్ణయిస్తారు. కార్యక్రమం కొరకు చలమ కొండల ప్రక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రింద ఉన్న పుట్టలో నుండి మట్టిని సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ఆధారితం కావున దేవాలయాలలో చేసే కార్యక్రమాలు గ్రామం సుభిక్షంగా పది పంటలతో వర్ధిల్లాలి అని చేపడతారు.
-> 10.03.2011 ఉదయం
-> ప్రార్ధన మరియు విశ్వక్షేన పూజా
-> పుణ్యావచనం
-> పంచగవ్య ఆరాధన
-> స్వామి వారికి విశేషర్చన మరియు నివేదన
అష్టోత్తర కలశ స్నపనం:
108 కళాశాలు రకరకాల ద్రవ్యాలు ఆయుర్వేద మూలికలు ఉంచి వాటితో స్వామి వారికి స్నపన కార్యక్రమం చేయాలి.
ప్రధానమైనవి: 1. ఆవు పాలు 2. ఆవు నెయ్యి. .ఆవు పెరుగు. 4. పంచ గవ్యం. 5. తేనే 6. నవ రత్నాలు. 7. నదీ తీర్ధం( తీర్దొదకం, బావి, కుంట, చెరువు మరియు నది నుండి తెచ్చిన నీటిని ఒక కలశంలో పోస్తారు) 8. వేడి నీళ్ళు 9. జపోదకం. 10.చందనం. 11. ఫలోదకం.

ఔషధాలు :
1. సర్వ గంధ చూర్ణం 2. సర్వేషద చూర్ణం 3. కాషాయ చూర్ణం 4. హరిద్రాచూర్ణం 5. జాతిఫలాది చూర్ణం 6. వనేషది. 7. ములాగంధం.

పైన తెల్పిన ఔషధులలో అన్ని రకాల మూలికలు ఉంటాయి. వీటిని వివిధ కలశాలలో ఉంచి ఆయా దేవతలను ఆవాహన చేస్తారు. అగ్ని ప్రతిష్టాపన చేసి హోమము నిర్వహిస్తారు. హోమం అనంతరం పైన తెల్పిన 108 కలశాలలో ఉన్న ఔషదులతో స్వామి వారికి స్నపనం (స్నానం) నిర్వహిస్తారు.

స్నపన కార్యక్రమం నిర్వహించుట వలన స్వామి వారికి మరింత శక్తి వస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం మానవులకు 365 రోజులు దేవునికి ఒక రోజుతో సమానం. వార్షిక కళ్యాణం చేయడం స్వామి వారికి రోజూ కళ్యాణం జరిపినట్లు లెక్క.
సాయంత్రం 7 గం. లకు స్వామి వారికి కళ్యాణం వైభవంగా జరిగింది. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కార్యక్రమాలన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పాఠశాల పండితులు శ్రీ పరాశరం భావన్నారాయణ చార్యులు మరియు వారి శిష్యులు మణిదీప్ కుమార్, మేఘనాథ నరసింహాచార్యులు నిర్వహించారు.
-> 11.03.2011 ఉదయం స్వామి వారికి అర్చన మరియు నివేదన స్వామి వారి గ్రామోత్సవం జరిగినది.

గ్రామోత్సవం నిర్వహించుటలో ముఖ్య ఉద్దేశం స్వామి వారిని ఆలయమునకు వచ్చి దర్శించుకోలేని వారి కొరకు స్వామి వారు వస్తారు. అప్పుడు స్వామి వారిని దర్శించుకొనే వారిని ఎవరూ అడ్డు చెప్పరాదు. ఆలా చేసినట్లయితే వారు నరకానికి పోతారని పురాణ వచనం.

అన్న దాన కార్య క్రమం 11-03-2011 ఉదయం 10.00 గంటలకు నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగింది. దాదాపు ఎనిమిది వేల మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదానం చేయుటలో గల ఆంతర్యం ఏమిటనగా.. మానవులకు ఏమి ఇచ్చిననూ( ధనం, బంగారం, భూమి, అధికారం మొ||) ఎంత ఇచ్చిననూ తృప్తి చెందరు. ఇంకా కావాలని కోరుకుంటారు. కానీ, భోజనం వలన మాత్రమే తృప్తి చెందుదురు ( భుక్తాయాసముతో!). అందువలన ప్రతి కార్యక్రమము నిర్వహించిన తరువాత అన్నదానము చేయుట శ్రేష్టము.

No comments:

Post a Comment