Friday, March 18, 2011

గంగా పార్వతీ సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం -స్థల పురాణం




నాదెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శివాలయము అతి పురాతనమైనది. స్వామి వారి పేరు శ్రీ మూలస్థానేశ్వర స్వామి. శ్రీ స్వామి వారు గంగా పార్వతీ సమేతులై యున్నారు. స్వామి వారికి పూర్వ కాలము నుండే పూజలు, ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నా ఆధారాలున్నాయి. ఆలయ నిర్వహణ కొరకు మాన్యములు, గొర్రెలు, మేకలు, ఆవులు, దానం గా ఇచ్చిన ఆధారాలున్నాయి. ఆలయ ప్రాంగణమంతా అనేక శాసనాలున్నాయి.
స్థల పురాణం


పూర్వ కాలంలో నాదెండ్ల ప్రాంతమంతా అరణ్యము. అరణ్యములో పెద్ద చెరువు ఉండెడిది. ప్రాంతములో అనేక మంది మునులు తపస్సు చేసుకొనేవారు. వారిలో మార్కండేయ మహర్షి ప్రసిద్ధులు .ఆయన శిష్య సపరివార సమేతంగా ప్రాంతంలో కొంత కలం గడిపినారు. ఒక నాడు చెరువు నందు స్నాన మాచరించి, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించి ధ్యానంలో నిమగ్నులై ఉన్నపుడు ఆయనకు పరమ శివుడు సాక్షాత్కరించాడు. మార్కండేయుల వారు కనులు తెరిచి చూడగా అక్కడ రాళ్ళూ, రప్పలు కనిపించాయి. మరలా ధ్యానంలోకి వెళ్ళగా అక్కడ స్థాపితమై ఉన్న రాయిలో పరమ శివుడు సాక్షాత్కరించాడు. దానినే శివ లింగముగా గుర్తించి, తన శిష్యులను పిలిచి, " కనిపించేది మాములు రాయి కాదు. అది సాక్షాత్తు పరమ శివుని రూపమైన శివలింగము.స్వామి వారి పేరు మూలా స్థానేశ్వర స్వామి " అని వారికి తెలిపి పూజలు జరిపించారు. కొంత కాలం పాటు కాలంలో ఉన్న మహర్షి , ఆయన శిష్యులు దారిన వెళ్ళే బాటసారులకు స్వామి వారిని చూపించి వారికి స్వామి వారి మహిమలు వివరించారు. కాల క్రమేణ ప్రాంతము అభివృద్ధి చెంది ఆలయము ప్రసిద్ధి చెందినది. విధముగా స్వామి వారిని మార్కండేయ మహర్షుల వారు గుర్తించి లోకానికి తెలియ చేసారు కనుక మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేసిన శివలింగముగా భావిస్తారు.
వివరణ: స్వయంభు శివ లింగమునకు, ప్రతిష్టించిన శివ లింగమునకు బేధము కలదు. స్వయంభు శివ లింగము మాములు రాయి మాదిరిగా, గతుకులు కలిగి ఉండును. కానీ ప్రతిష్టించిన శివ లింగము నున్నగా ఉండును.మన శివాలయములో శివలింగమును పరిశీలిస్తే తేడ స్పష్టముగా కనపడును.స్వామి వారిని అభిషేక సమయములో పరిశీలిస్తే శివలింగములో కళ్ళు, ముక్కు, స్పష్టంగా కనిపిస్తాయని కొందరి భక్తుల అభిప్రాయం.

No comments:

Post a Comment