Friday, March 25, 2011

ఆలయ చరిత్ర - మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం


అతి పురాతనమైన మూల స్థానేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర గురించి పురావస్తు శాఖ అధికారులలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీ బంగారయ్య గారు శివాలయాన్ని పరిశీలించి అతి పురాతన ఆలయాలలో ఇది ఒకటని, క్రీ. . 5 శతాబ్దం నాటిదని, ఇది మొదట జైనాలయమని, కాల క్రమేణా శివాలయంగా మార్పు చెందినదని అభిప్రాయపడ్డారు. గతంలో శివాలయాన్ని పరిశీలించిన పురావస్తు శాఖాధికారులు కాకతీయుల కాలం నాటికే ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

గుంటూరుకు చెందిన శ్రీ విష్ణుబొట్ల సూర్యనారాయణ గారు 1962 లో ప్రచురించిన" నరసరావు పేట తాలూకా గ్రామ చరిత్ర" పుస్తకంలో 94 వ పేజీ నందు శివాలయం గురించి ఈ విధంగా ప్రస్తావన ఉన్నది. క్రీ..1046 సంవత్సరపు శాసనమున ముక్కోల గోమన శెట్టి యనునతడు విశ్వేశ్వర దేవుని నిలిపి మందిరమెత్తినట్లు కనపడుతున్నది. గ్రామంలో లభించిన 12 శతాబ్ది నాటి శాసనములలో ఒక దానియందు మూల స్థానేశ్వరుని దేవాలయము ఒకటి ఉన్నట్లును, స్వామికి పెట్టబడు నైవేద్యములో ఎవరెవరికి ఎంతెంత చెందవలసియున్నదను విషయం వ్రాయబడి యున్నది. మరియొక శాసనమున" శ్రీ మన్మహామండలేశ్వర బుద్దరాజు కులసతియైన గుండమహదేవి తను కట్టించిన గుండసముద్రమను గ్రామమును మూల స్థానేశ్వరునకు నైవేద్యము కొరకు ఇచ్చినట్లు గలదు.

కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు(1199 - 1262) నాటికి నాదెండ్ల మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆనాటి కాకతీయుల పరిపాలనలో శివాలయాలు అధ్వర్యంలో గోళకీ మఠాలు అనే సేవా సంస్థలు నడపబడుచుండేవి. గొళకీ మఠం అనగా సమాజానికి కేంద్ర బిందువు. విద్యాలయం, విద్యాలయం, ప్రసూతి కేంద్రం, సాంస్కృతిక కేంద్రం.శైవమతాచార్యుల ఆధ్వర్యంలో గోళకీ మఠాలు నిర్వహించ బడుతుండేవి.మొదట వీటిని స్థాపించినది గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శివ దేవుడు. మన శివాలయం లోని గోళకీ మఠాన్ని విశ్వేశ్వర శివ దేవుడు స్థాపించి, నిర్వహించారు. ఆయన దర్శనార్ధం వచ్చిన గణపతి దేవుడు మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గణపతి దేవుడు బస చేసిన ప్రాంతాలలో కొన్ని గ్రామాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి గణపవరం అనే పేరుతో అభివృద్ధి చెందాయి. ఇలాంటి గణపవరాలు ఆంధ్ర దేశంలో అనేకం ఉన్నాయని ప్రముఖ చరిత్రకారులు ABK ప్రసాద్ గారి అభిప్రాయం. మన గ్రామ సమీపంలో ఉన్న గణపవరం గ్రామం కూడా విధంగానే అభివృద్ధి చెంది ఉంటుంది. దీనిని బట్టి గణపతి దేవుడు మన గ్రామాన్ని, మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించారని రూఢి చేసుకోవచ్చు.

తర్వాత ముస్లిం రాజుల పరిపాలనలో హిందూ సంస్కృతిని, దేవాలయాలను నాశనం చేసే కార్యక్రమంలో భాగంగా దేవాలయానికి వచ్చినపుడు స్థానిక అర్చకులు ఎంతో యుక్తితో శివలింగము పై ఒక జల్ల (వెదురు గంప) ను బోర్లించారు. ముష్కరులు అలయమంతా వెదికినా విగ్రహం కనపడలేదు. ఇక్కడ దేవుని విగ్రహం ఏదనగా, ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవని సమాధానమిచ్చారు. జల్ల కింద ఏముంది అని ప్రశ్నించారు. పాల పిడతలు దాచమని, పిల్లి వచ్చి పాడు చేయకుండా జల్ల కింద ఉంచామని బదులిచ్చారు. వారు దేవాలయ ప్రాంతమంతా వెతికినా విగ్రహాలు ఏమి కనపడక పోవటంతో, అక్కడే శాసనము పై నిలబెట్టి ఉన్న నంది తలను నరికి వెళ్ళిపోయారు. శాసనమును ఇప్పటికి శివాలయములో చూడవచ్చు.
( కాలములోనే తాతకొండపై గోవర్ధన స్వామి ఆలయాన్ని, గాంధేయ గట్టుపై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని,చలం కొండలపై ఉన్న వీరభద్ర స్వామి వారి ఆలయాలను ధ్వంసం చేసారు.)

No comments:

Post a Comment